పుట:AndhraRachaitaluVol1.djvu/499

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్థానమును వచ్చియున్నది. ప్రతిభావ్యుత్పత్తులు నికరముగా నున్న నాడు కాని కవి రాణింపడు. వీనిలో, దేనిపాలు వెలితిపడినను, అది కవికి గొఱతయే. ప్రకృతము, పింగళి కాటూరి కవులను గుఱించి. వారు మంచి ప్రతిభావము గల మేధావులు.దానికి దగినటులు వ్యుత్పన్నతయు జక్కనిది. ఈ గుణద్వయమునకు దోడు వీడని యభ్యాస మొకటి. 'సౌదరనంద' మీ సమ్మేళనము పండినపంటయై, నందనారామమై పండువుచేయుచున్నది. 'బుద్ధచరిత్ర' రచయితలు తిరుపతి వేంకటకవుల కీకావ్యము గురూపహారముగా నీయబడినది. కాదేని, వారిలో నభిన్నులుగానుండిన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారికే 'గురుదక్షిణ' యనుకొందము. గురువుగారి షష్టిపూర్త్యుత్సవావసరమున నీకబ్బ మప్పనము సేయబడ్డది. అప్పటి సమర్పణ పద్యము, లీశిష్యుల జంట యగాధవినయ మధురహృదయములను దోయిళ్ళ బట్టికొన్నది. అందలివి కొన్ని:-

కేతనతోడి పొత్తునకు గేల్ కలపం దలపోసికాదు, నీ

చేతము మెచ్చగా గవిత చెప్పగ నేర్తు మటంచుగాదు, వి

ఖ్యాతికిగా, ది కేమనిన, నద్యతనాంధ్ర కవిప్రపంచ ని

ర్మాతకు భక్తిమై నుడుగరల్ ఘటియించెడి పూన్కియే నుమీ!

                  *

సంచితపూర్వపుణ్యము లొసంగు ఫలమ్ములు వోలె వాసనల్

మంచుకొనన్ నవప్రసవముల్ విరబూచుచునున్న దీవు క

ల్పించిన పాదులందు బ్రభవించిన నూత్న కవిత్వ వల్లి; యీ

కొంచెపు బూలమాలగయికొమ్ము గళాభరణమ్ముగా గురూ !

భావ విశుద్ధి దోపగ భవత్పదముల్ భజియించునాటి మా

సేవలు మెచ్చి యాదర విశేష మెలర్పగ సల్పినట్టి మీ

దీవన నిక్కమై యొసగె దియ్యని కావ్యఫలమ్ము నేటికిన్ ;

నీ విడిన భిక్ష యిది నీకె యొసంగెద మిప్డు విందుగాన్.