Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/466

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్టి దివ్యసందేశము లందిచ్చు రచయితలు మహాత్ములు కారా? ప్రభాకరశాస్త్రిగారి జీవితము మనరచయితల కొరవడిగానుండవలసినది. తిరుపతి కళాశాలలో నుపాధ్యాయవృత్తిలో నిపు డున్నారు. గ్రంథముల వలన గొంతరాబడి వచ్చుచున్నది. ఇది యంతయు నతిధ్యభ్యాగతుల సత్కారమునకు వినియోగింప బడుచున్నది. భోగ త్యాగములు సరిగా నలవఱచుకొన్నవారిలో శాస్త్రిగారిది యుత్తమస్థానము. మఱియొకటి: సమాజసంస్కారమును వాంఛించుటయే కాక, ఆచరించి చూపుట వీరిలో గొప్ప విశేషము. శ్రీ విస్సా అప్పారావుగారు, ప్రభాకరశాస్త్రులుగారును విభిన్న శాఖియు లయ్యును వియ్యమంది రనుట చెప్పదగిన విషయము. ఎన్నో విశిష్టలక్షణములతో నిండారియున్న వేటూరి పండితుని సాహిత్యసేవ శాశ్వతమైనది. ఆయన రెడ్డి రాజ్య చరిత్రపరిశీలనము, చారిత్రకులకు మేలిబాట చూపినది. ఆయన పీఠికలు మహాగ్రంథములై పొలుపారుచున్నవి. ఆంధ్రకవిత, అరసున్న, ఆంధ్ర లిపి సంస్కారము, వింతనిఘంటువులు మున్నగువిషయములపై వారు చర్చించి ప్రకటించిన సత్యములు మఱచి పోరానివి. ముద్దుముద్దుగా, రస కుల్యలుగా బ్రవహింప జేసిన వారి ఖండకావ్య రచనలు సమాస్వాదింప దగినవి. భాషా- సారస్వత పరిశోధనములందు ప్రసిద్దులైన ప్రభాకరశాస్త్రిగారి జీవనము విద్వత్కవిలోకమునకు విజయ వైజయంతిక.


                        _______________