పుట:AndhraRachaitaluVol1.djvu/460

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేటూరి ప్రభాకరశాస్త్రి

1883


వైదిక బ్రాహ్మణులు. తల్లి: శేషమ్మ. తండ్రి: సుందరశాస్త్రి. నివాసస్థానము: తిరుపతి. జననము: 1883 ఫిబ్రవరి, సర్వజిన్నామ సంవత్సర మాఖబహుళైకాదశి మంగళవాసరము. గ్రంథములు: 1. నీతినిధి (వచనము) 2. కడుపుతీపి. 3. కపోతకథ. 4. విశ్వాసము. 5. మూనాళ్ళుముచ్చట (ఈ నాలుగును ఖండకావ్యములు) 6. ప్రతిమానాటకము. 7. కర్ణభారము. 8. మధ్యమవ్యాయోగము (ఈ మూడును భాసకృతులకనువాదములు) 9. భగవదజ్జుకము (బోధాయనకృతి ప్రహసమునకనువాదము) 10. శృంగారశ్రీనాధము. (శ్రీనాధునికాలము, కృతులు మున్నగు విషయములపై విపుల విమర్శనము) 11. తంజావూరు ఆంధ్ర రాజుల చరిత్రము. 12. కనకాభిషేకము (శ్రీనాధునకు సంబంధించిన చరిత్రము) 13. చాటుపద్యమణి మంజిరి. 14. ప్రబంధరత్నావళి. 15. తెలుగు మెరుగులు ఇత్యాదులు.


ఎడతెఱిపిలేని భాషాపరిశ్రమము - గడిదేఱిన యుభయసారస్వత పాండిత్యములు - వడిగల కార్యాదీక్షా దక్షత - చెడిపోని తలంపులు - ఒడిదొడుకులు లేని తేట తెనుగు కవితారచన - కడదాకిన తాత్త్వికదృష్టి - ఈ విశిష్టలక్షణములతో బుట్టిన మహారచయితలు వేటూరి ప్రభాకరశాస్త్రిగారు. ద్రావిడము నెఱుగుదురు. ఆంగ్లమున వలసినంత పరిచయము. అచ్చుయంత్రముల మొగమెఱుగక మట్టిబ్రుంగిన తాటియాకులను బట్టుకొని కన్నులు చిల్లులుచేసికొనెడి నిరంతర వ్యవసాయము. దానికిసాయము చెన్నపురి ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో బరిశోధకపదవి. పెక్కు వత్సరములు ప్రభాకరశాస్త్రిగారాపదవిలో నుండి మదరాసు పండితులచే జోహారులు చేయించుకొనుచు బరిశోధనము గావించినారు. ఈ పరిశోధన ఫలితము శృంగార శ్రీనాథాదిగ్రంధద్వారమున దెలుగువారు చూఱలాడుచున్నారు.