పుట:AndhraRachaitaluVol1.djvu/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీడును గూడి యిష్టాగోష్టి సల్పుకొను సందర్భమున హాస్య చతురుడు గుండారాయడు 'మన జీవితములు కడచిన తర్వాత లోకము మనల నెటు ప్రశంసించునో తలచి చూచుకొందమా? అనెనట. అందఱు నంగీకరించిరట. నూజవీటి అప్పారాయడు చనిపోయెనా బైరాగులందఱును బలవించెదరు. తాను చనిపోయితినా వేశ్యలందఱు పలవించెదరు. వేంకటాద్రి నాయుడు చనిపోయెనా అందఱు ఆహా యని సంతోషించెదరు."

ఈ గుండారాయని యాస్థానమున నుండి పాండిత్య శక్తిచే నీ కనకాద్రి శాస్త్రిగారు స్థిరమైన భూమి నార్జించి సుఖించెను. నృసింహవిద్వత్కవి తల్లి కూడా విదుషి. ఆమె పేరు జానకమ్మ. చదలపాక సుబ్బయా మాత్యుని కొమార్తె. ఈ పద్యము లామెయే చెప్పినదట:

"మతుకుమల్లియిల్లు మహి విద్య వెదచల్లు
పరబుధేంద్రులకును బ్రక్కముల్లు
ఎఱిగి మెలగి రేని నెలమిచే వాటిల్లు
గాన వారి యిల్లు ఘనత జెందె"
అతి చమత్కృతి గలిగిన మతుకుమల్లి
వారు శబ్దము గొల్పిన కారణమున
వసుధ లోపల మంచెళ్ళ వారియిల్లు
శారదాదేవి నాటకశాల యండ్రు
వాసుదేవుని కవితావిలాస మచట
మొలక బంగరు గజ్జెల మ్రోత గాదె?

మన కవివరుని తమ్ముడు కృష్ణశాస్త్రి. ఆయన తన యన్నగారి "అజ చరిత్రము" లో నక్కడక్కడ నాశ్వాసాంతపద్యములు పోయినవి మరల వ్రాసెను. అతడు కూడా జక్కని కవితాధార కలవాడు.

మన నృసింహవిద్వత్కవి పూర్వులను మించిన పండితుడు అజచరిత్రమును ప్రౌఢ ప్రబంధ మితని కృతులలో నుతికెక్కినది. ఇందలి శైలి వసుచరిత్రకు సహపాఠి. తెలుగు కంటె సంస్కృతపుబాలు వీరి కవితలో