పుట:AndhraRachaitaluVol1.djvu/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కథాపీఠము

ఆంధ్రకవిత నన్నయ మొదలు చిన్నయదాక నొకతీరున సాగినది. నడుమ నడుమ గొన్ని మార్పులు కలిగినను అవి యల్పములు. ఈ కవితా నుడి ఇంచుమించు చిన్నయసూరి నాటినుండి వాజ్మయ వాహిని క్రొత్తదారులు తీసినది. ఈత్రోవలెల్ల క్షుణ్ణము చేసిన మహాశయులు వీరేశలింగము పంతులుగారు. కొన్నిటిని మార్గదర్శిత్వమే పంతులుగారిది. నవలలు, వ్యాసరచనలు, కవిజీవితములు, స్వీయచరిత్రములు, కథానికలు, ఖండకావ్యములు, ప్రహసనములు, గ్రంథవిమర్శనములు, నాటికలు, చరిత్ర పరిశోధనము, పత్త్రికాప్రచురణము - ఇత్యాదులు నేటి సారస్వతవృక్షము చేసిన క్రొత్తకొమ్మలు. ఈకొమ్మ లెల్ల ముమ్మరముగా జూచి కాచుచుండుట నేడు పరికించుచున్నాము. పయి పట్టికలోని వన్నియు నపూర్వము లనుకొనముగదా, ప్రకృత కాల పరిస్థితుల ననుసరించి మన కాత్రోవలు కొన్ని కావలసి గట్టిచేసికొంటిమి.

వీనిలో కవిచరిత్ర రచన మొకటి. శ్రీ వీరేశలింగము పంతులుగారు బహు పరిశ్రమకు బాల్పడి ఆంధ్రకవుల చరిత్రలు సంపాదించి వెలువరించిరి. అంతకుమున్ను శ్రీ గురుజాడ శ్రీరామమూర్తిగా రాంగ్లేయుల మార్గము నాశ్రయించి కవి జీవితములు ప్రచురపరిచిరి. గురుజాడ వారి రచనపై వీరేశలింగముగారి కూర్పు సంస్కరణ పూరణములు కలదిగా వెలసినది. కావలి వేంకటరామస్వామి యనునాయన ఆంగ్లభాషలో గొంద రాంధ్రకవులను గూర్చిన చరిత్రలు వ్రాసి 1847 వ యేట బొంబాయిలో వెలువరించినారని మిత్రులు చెప్పుట. బ్రౌనుదొర తన నిఘంటువున బ్రసంగమున గొందరు ప్రాక్తనకవులను గూర్చి యించించుక వ్రాసెను. ఇవి బొత్తిగా చాలనివి. గురుజాడ శ్రీరామమూర్తిగారి కవి జీవితములు 1873 లో మొదలై పదేండ్లకు బూర్ణముగా బయట బడినది. వీరేశలింగము పంతులుగారి కవిచరిత్రము 1865 నాటికి ప్రకటితము. పంతులుగారి కూర్పు తెలుగూ వారికి మేలుబంతి. ఇటీవల నిటీవల విడివిడిగా, విపుల విపులముగా కవి జీవితములు