గడియారము వేంకట శేష శాస్త్రి
1897
ములికినాటిశాఖీయ బ్రాహ్మణుడు. మైత్రేయసగోత్రుడు. ఆపస్తంబ సూత్రుడు. తల్లి: నరసమాంబ. తండ్రి: రామయ్య. జన్మస్థానము: కడపజిల్లా జంబులమడుగు తాలూకాలోని ' నెమళ్ళదిన్నె '. నివాసము: ప్రొద్దుటూరు. జననము: 3-4-1897 సం.
కృతులు: 1. శ్రీ శివభారతము (8 ఆశ్వాసముల శివాజీ ప్రబంధము. 1943 ముద్రి.) 2. మురారి. 3. పుష్పబాణ విలాసము. 4. వాస్తుజంత్రి (ఈ మూడును ముద్రితములు కాలేదు.) 5. మల్లికామారుతము. 6. వాల్మీకి (అసమగ్రములు) 7. శ్రీకృష్ణదేవరాయ చరిత్రము (ప్రస్తుతము రచనలో నున్నది.)
1943 సంవత్సరమునకు బూర్వము 'గడియారము వేంకట శేషశాస్త్రి' యనిన పేరు తెలుగువారిలో నెఱిగినవా రేకొందఱో. నామట్టుకు నేను వారినిగూర్చి విన్నవాడను గాను. ఎన్నడో, ఆయన 'కవధానిపంచానస' యని బిరుదమిచ్చి పండితులు మెచ్చుకొనిరట. ఆపేరైనను రాయలసీమ దాటి రాలేదు. మాడభూషి వారు, దేవులపల్లి వారు, తిరుపతివేంకటకవులు అవధానపుగారడీతో నూరూర బేరుగాంచిరి. వారినిజూచి, అందులో విశేషించి తిరుపతికవులను జూచి కవితచెప్ప నేర్చినవాడెల్ల నవధానము చేసినగాని ముక్తిలే దనుకొని, ఆ కళ నభ్యాసము జేసెను. అప్పటి యాతెలుగులోకము గతానుగతికము. పలువురతోపాటు శేషశాస్త్రిగారును విద్యాధ్యయన మైన పిమ్మట, సహజకవితలో బ్రవీణత నందినపిమ్మట శతావధాన వ్యాయామముచేసెను.
మఱియొక కవితోడుతీసుకొనిగాని, యవధానములుసేయుట నాడు తక్కువ. అప్పటియాచారప్రకారము తనకన్నింట పరిపాటియగు శ్రీ దుర్భాక రాజశేఖరకవితో జతపడి యవధానములు చేయసాగెను.