పుట:AndhraRachaitaluVol1.djvu/364

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ యేడే ప్రొద్దుటూరు 'జిల్లా మునసబు కోర్టు' లో నుద్యోగించుట కుపక్రమించిరి. అది పదుమూడేండ్లు సాగినది. అదియే స్వరాజ్య సముద్రమునకు మంచి పోటుసమయము. మోహనదాసు కరుణాచంద్రుడు పదారుకళలతో స్వరాజ్యపు వెన్నెల వెలుగుతో భారతాకాశమున వెలుంగుచున్న పార్వణసమయము. అట్టి స్వతంత్రపు బోటులో కోర్టు ఉద్యోగమునకు రాజీనామా నిచ్చిన దేశాభిమానులు రాజశేఖర కవిగారు. కోర్టు ఉద్యోగసమయమున గూడ సాహిత్యోద్యోగము నేమఱలేదు. అపుడే యవధాన ప్రదర్శన వాంఛ యంకురించి తమకు దోడుగ శ్రీ గడియారము వేంకటశేషశాస్త్రిగారు కూడిరాగా, "రాజశేఖర వేంకట శేష కవులు " అను జంటపేరు పెట్టుకొని 1920 నుండి 1927 దాక దత్త మండల భాగముల కాహ్వానింపబడి యనేకావధానములు గావించిరి. తరువాత దరువాత నవధానయుగము మాఱి యాకవు లెవరికి వారు స్వతంత్రకావ్యవిరచనమునకు దొరకొనిరి. కలసి యుండగా వీరికి గౌరవించి యిచ్చిన బిరుదములు కవిసింహ, అవధాని పంచానన ఇత్యాదులు. పిమ్మట నీజంట చెలికారముతోనే వేఱయినది. అవధానసార మను గ్రంథము నాటి వీరి కలయికకు గుఱుతు.


రాజశేఖరుని వాజ్మయమును దేశమును సమానప్రపత్తితో సేవించెను. దేశసేవకై యుద్యోగమునకు నీళ్ళువదలిరి. ప్రొద్దుటూరు మ్యునిసిపలు సంఘ సభ్యులుగా బెక్కువత్సరములు పనిచేసి 1928 లో ఉపాధ్యక్షులు ( Vice Chairman ) గా నెన్నుకోబడిరి. అదిగాక 1927 మొదలు 1932 దాక ప్రొద్దుటూరు తాలుకాబోర్డు ఉపాధ్యక్షులుగా గూడ నుండిరి. పదపడి, మదరాసు సెనేటు సభ్యత - వేదపాఠశాలాకార్యదర్శిత మున్నగు ప్రజాహితోద్యోగములు వీరికిదక్కినవి.


నేటికి వీరి వయసు షష్టిదాటినది. దేశ - భాషాభిరతుడైన యీ మహాకవి త్రిలిజ్గలోకము గుర్తించి యెన్నోసారులు సన్మా