పుట:AndhraRachaitaluVol1.djvu/36

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అభ్యాప్యార్యతమాయ విత్తబహులందత్వా పరార్దం పరం
తేన స్యాత్తన సత్కళత్రవిభవ స్తస్మా దిహైత త్కురు.

అని మిత్త్రులు వివాహార్థ మెచ్చరించిరట. ఆసమయమున జిరపరిచయులగు శిష్టుకవిగారు రామచంద్రపురము రాజుగారికి "ఇతని నాస్థాన పండితునిగా గౌరవింపు" డని యుత్తరము వ్రాసి యీయగా వారు దేశమున క్షామము పట్టుటచే నీకవిని రెండు నెలలకంటే నెక్కువపోషింపలేమనిచెప్పిరట. ఆమాట రామచంద్రశాస్త్రికి నచ్చలేదు. మదరాసు పోయి యేదో యుద్యోగము సంపాదించుటకు సంకల్పించి ప్రయాణము సాగించెను. త్రోవలో మచిలీపట్టణమున నాగవలసివచ్చి ఇంగువ రామస్వామి శాస్త్రిగారియొద్ద మంత్ర శాస్త్రమభ్యసించెను. అప్పుడు వఠ్ఠెం అద్యైత పరబ్రహ్మశాస్త్రి పాండిత్యశక్తి పరీక్షకు వాక్యార్దముచేయగా నందాయనను ధిక్కరించి పెండ్లిచెడదీసికొని యింటికి బోయెను. ఆయన స్వస్థలము నడవపల్లి. ఆయూరివారు రామచంద్రశాస్త్రి సామర్ద్యము పరీక్షించుటకు శతావధానము చేయమనిరి. మహాకవితాధార కలిగిన యీయన కదియొక లెక్కా పద్యములు తడువుకొనకుండ నవధానమున జెప్పెనట. ఆపద్యములు మాత్ర మనుపలబ్ధములు.

క్రమముగా శాస్రిగారి పాండితీకవితా ప్రతిభలు నుతికెక్కినవి. బందరు నోబిలుపాఠశాలలో నుద్యోగము లబించినది. అక్కడ 43 వత్సరములు పనిచేసిరి. దొరలు వీరి నైష్టికతకు నివ్వెఱపోయెడివారు. ఇత డెవ్వరిని లెక్కసేయలేదు. ఉద్యోగించిన నలువదిమూడేండ్లలో ' ఈతప్పుచేసితి ' వని యధ్యక్షునిచే నాక్షేపింపబడలేదు. కళాశాలధ్యక్షుకు నీయనకు నొక శ్లోకార్దములో వ్యతి రేకాభిప్రాయములు వచ్చినవి. శాస్త్రులుగారు ముక్తకంఠమున "మీయర్ధము పొరపా"టని త్రోసివైచిరి. తాత్కాలికముగా నధికారికి గ్రోధావేశము కలిగినను శాస్త్రులు గారి యధార్ధవాదిత కాయన తలయొగ్గక తప్పినదికాదు.