పుట:AndhraRachaitaluVol1.djvu/359

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటివా రయి యుందురు. ఇది సిద్ధాంతము కాక పోవచ్చును. సరస్వతీ గ్రంథమండలివారు వీరి "అరక్షణీయ" వెలువరించిరి. ఎందరో తరువాత దరువాత శరత్ చంద్రుని పూర్తిగా దెలుగు వానిగ జేసికొన్నారు. అన్య సారస్వతములలోని యంద మెరిగి యా రచనలు తెలుగులో బెట్టవలెనని ప్రోత్సాహము చేసినవారిలో శాస్త్రిగా రొకరనుటలో సంశయింప బనిలేదు. హిందీ నుండి, వంగము నుండి చాల రచనలు వీ రనువదించినవి ప్రచురణములై యున్నవి. శాస్త్రిగారి వచన రచన బహు - సుందరముగ నుండి సులభముగ నర్థమగు తీరున జాలువారును. పద్యరచనా సౌందర్యము వీరి కలములో నంతగా వెలయలే దని కొందర యభిప్రాయము. కాని, యఖండమైన వేదన నుండి వీరి కవిత ప్రాదుర్భవించినది. "హృధయేశ్వరి" యందులకు నిదర్శనము. ప్రణయ కవిత కీ కృతి యాకరము.


మన్మనమ్మున లీనమై మాటు వడిన
విమల కవితా ప్రవాహము నెగ్గలించు
నిన్ను వర్ణింప నెంచిన నిమిషమందు
నీవు నాకు సరస్వతీదేవి వమ్మ !


ఇది వారి విశ్వాసము. ప్రేయసి యీయన దృష్టిలో మహాదేవి. ఆమె నొక పవిత్ర దృష్టిలో సంభావించుట వారి తలపు. రాధా కృష్ణుల ప్రేమ సౌభాగ్యము శివశంకర శాస్త్రిగారికి మేలు బంతి.

నిన్ను ధ్యానించు కొలది నిర్నిద్ర మగుచు
ప్రమదమున జేరు మానస బంభరంబు
రాధికానాథు పాద నీరజ యుగమ్ము;
వింత గొల్పెడు నా ముక్తికాంతవమ్మ !


జీవిత సర్వస్వమయిన హృదయేశ్వరి శాస్త్రిగారి దృక్పథములో నెట్లు నిలిచి యున్నదో, యీ పద్యములు తారకాణించును.