పుట:AndhraRachaitaluVol1.djvu/321

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

గీ. ఒకడు స్వప్నప్రకారము నుగ్గడింప

నెల్లవారలకు గలవె తెల్లవార్లు

నవ్వుదురను తలంపు లే దెవ్వరికిని

పేరుకొననేమిటికి నట్టి బీదకవుల?

గీ. పూర్వకవిరాజులకు నిది భూషణంబొ

దూషణమొ యనుకొనుడు మీతోచినట్లు

నన్నయాదుల పట్ల మాకన్న గూర్మి

గలుగువారలు లేరు జగమ్మునందు.

ఈ యపరాధ పద్యములపై క్షమాపణము చెప్పవలసినదని ప్రతి పట్టనమున సభలు గావించి తీర్మానములు చేయుచుండిరి. అపు డీ కవకవులు కాళ్లు విరగ ద్రొక్కుకొను తెలుగు సోదరుల గని నవ్వుకొనుచు 'దేశభక్తి' యను నొకవ్యాఖ్య వ్రాసి "మేము చేసినది నిందాస్తుతిగాని కేవలనిందగాదు. ఈ విధముగా మేము ప్రాక్తనకవులను గూర్చి వ్రాయుట యాధునికులకు బ్రాచీన కవిసత్తములపై నెంతగా భక్తివిశ్వాసములు కలవో పరీక్షించుటకే" అని సమాధానము చెప్పిరి. అపుడీ నవీన పద్ధతిని గనిపెట్టి రామకృష్ణులను సరసు లభినందించిరి. విరసులు పరిహసించిరి. "కౌరవగౌరవ" మనుపేర బాండవులది యన్యాయమనియు, కౌరవులది న్యాయమనియు సమర్థించుచు జక్కని పద్యములు 'ఆంధ్ర సాహిత్య పరిషత్పత్త్రిక' లో నావిష్కరించిరి. అందలి విషయ మెట్లున్నను గవితా ధోరణి భారతమును బోలియున్నదని జయంతి రామయ్యపంతులు గారు మఱిమఱి ప్రస్తుతించిరి. ఇట్లే రామకృష్ణకవులు విలక్షణ భావనా పథవిహారులై యుండెడివారు. వీరి 'పాణిగృహీతి' యను ఖండకావ్యము తెలుగు వాజ్మయమున కొక గళాభరణము. ప్రతిపద్యము నొక మహానర్ఘమణి. కొన్నిమణులు ముందు పెట్టెదను.