పుట:AndhraRachaitaluVol1.djvu/308

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేంకటకవులు తెలుగు భూమిలో నొందని సన్మానము లేదు. కృష్ణా పత్త్రికాధిపతులన్నటులు 'వీరి కవిత్వము ప్రాచీనకవితకు భరతవాక్యము. నవీనకవిత్వమునకు నంది. వీరికవిత్వమందెచ్చట జూచినను సౌకుమార్యము పౌరుషము జీవము గోచరించుచుండును. ఈ విలక్షణములే యాంధ్ర దేశమున శిష్య సహస్త్రములు వెదచల్లినవి. వీరిరచన లెక్కువగ వీరి జీవితమునకు సంబంధించిన వగుటచే నా కవిత్వ మాత్మగౌరవమును బ్రతిష్ఠించు కొనినది."

ఈ శతావధానులు సారస్వత సమారాధనము 1949 సంవత్సరము నాటికి సంపూర్ణముగా బండి, మదరాసు ప్రభుత్వముచే నిండుగా గుర్తింపబడినది. శ్రీ వేంకటశాస్త్రిగారిని మదరాసు దొరతనపు బ్రథమ సంస్థానకవిగా గౌరవించుటలో భేదభావ మెవరును జూపకుండుట తిరుపతికవుల వాజ్మయసేవ కొక విజయధ్వజము. తనయూరు దాటక యావత్ర్పభుత్వమును, యావత్కవిలోకమును విజయవాడకు రప్పించుకొనిన శ్రీ శాస్త్రిగారి వార్థక శ్రీ తెలుగుదేశమునకు గర్వాభరణము. ఏమహాకవిని నిట్టితీరుగా దేశము సన్మానింపలేదు. శిష్య ప్రశిష్యులు బ్రహ్మరథము పట్టిరి. మదరాసు ప్రధానమంత్రులు, మంత్రులు, విశ్వవిద్యాలయాధికారులు, మహాపండితులు, కవులు పరివేష్టించియున్న నాటి సన్మాన సభావృత్తాంతము సారస్వత చరిత్రములో నొక దివ్య ప్రకరణము. రాయలసీమనుండి వచ్చిన గడియారము వేంకటశేషశాస్త్రిగారు నాడిటులు ప్రశంసించినారు.

జయమేపార శతావధాన కవితా సామ్రాజ్యపీఠంబు స

చ్ఛయశోమూలముగాగ నేలిన మహాసారస్వత జ్యోతి రు

చ్చయమౌ వేంకటశాస్త్రి యాంధ్రకవితా స్థానీప్రభుండయ్యె, న

న్నయ తిక్కనల నాటి వైభవము లీనాడయ్యె వాగ్దేవికిన్.

      *      *      *      *       *