పుట:AndhraRachaitaluVol1.djvu/300

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని ప్రతినపట్టి కొన్నినా ళ్లాంధ్రకవితా సామ్రాజ్యము నేకచ్ఛత్రముగ బరిపాలించిన తిరుపతివేంకట కవులు జగమెఱిగిన బ్రాహ్మణులు. ఆంధ్రదేశమున వీరి పేరు నెఱుగని యభిజ్ఞడుండడు. అభినవాంధ్ర కవులలో వీరిని గురువులుగా భావించువారు వందలమీద నుందురు. తిరుపతి వేంకటకవుల కేకలవ్యశిష్యుల మని చెప్పుకొని గౌరవింప బడువారు పెక్కుఱు. ఆంధ్రవసుంధరలో వీరు సందర్శింపని రాజాస్థానములేదు. ఆరంభదశలో దిరుపతి వేంకటకవులు "తిరుపతివేంకటేశ్వరు" లనియే తెలుగునాట వాడుక. ఈజంటకవు లే మహారాజును లెక్కసేయలేదు. "అనుభవించితిమి దీవ్యద్భోగములన రాజాధిరాజులకన్ననధికముగను"-"ఏనుగునెక్కినాము ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము" అని చెప్పుకొనుచు బ్రతిపట్టణము, ప్రతిగ్రామము తిరిగినారు; ప్రతిదాతను దర్శించినారు. వారిచే దగినట్లు సన్మానింప బడినసరే- లేనిచో సహజకవితా ధోరణినిమొగము వాచునట్లు తిట్టబద్దెములు చెప్పుట, ఈ కవులు సిద్ధవాక్కులని వారు వెఱచి పాదాక్రాంతులగుట పెక్కుచోట్ల జరిగినది. అనిదంపూర్వమైన వీరి యద్భుతశక్తి కబ్బురపడి యనేకకవులు 'శిష్యోహ' మ్మని చరణముల బడజొచ్చిరి. వీరి యవధాన ప్రతిభ నరసి తెనుగుమన్నీ లెందఱో బిరుదములు నొసగిరి; సాలువలుగప్పిరి; సన్మానములుచేసిరి; ఏనుగులపై నూరేగించిరి.

తిరుపతికవుల జీవిత మొక మహాభారతము. ఇందేపర్వము పరిశీలించినను బ్రతిజ్ఞలుసేయుట, మీసములు దువ్వుకొనుట, ప్రతిపక్షులను బరిహసించుట, పద్మవ్యూహములు పన్నుట, వానిని భేదించుట, యెదిరి యెట్టివాడైన సాహసించి మీది కురుకుట-యివిచూతుము. ఈ భారతమున గూడ రాయబారముల రభసలు, శతఘ్నుల చప్పుడులు, పాశుపతప్రయోగములు, అట్టహాసములు, తాలుకుట్టనములు కలవు. ఉద్యోగ