పుట:AndhraRachaitaluVol1.djvu/27

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యాకరణము రచించుటకు దగిన పాణినీయపాండితియు ప్రయోగపరిజ్ఞానము లేనివాడనుట అన్యాయము.

ఆంధ్ర విశ్వవిద్యాలయ పండితులు శ్రీ దువ్వూరి వేంకటరమణశాస్త్రి గారీ వాదమును బలపఱుచు గడకు వారు నిష్కరించి తేల్చిన యభిప్రాయమిది.

"...పూర్వోదాహృతములగు సంశయములన్నియు బాల వ్యాకరణమే ప్రాథమికమని స్థాపింపజాలియుండుట వల్లను, సూరి గారు విద్వాంసులని పండితపరంపరాయాతమగు ప్రసిద్ధి యుండుటవల్లను, నాంధ్ర సాహిత్య పరిష త్కార్యాలయము వారు ప్రచురించిన సూరిగారి జీవితమును బట్టియు, సూరిగారు రచించిన నిఘంటువును బట్టియు వీరిట్టి వ్యాకరణ గ్రంథము స్వతంత్రముగా రచించుటకు సమర్థులని స్పష్టముగా దెలియుచుండుట వల్లను, బూర్వోదాహృతమగు నశ్వశాస్త్రకథనుబట్టి శిష్టు కవిగారిట్టి గ్రంథ కల్పనము చేయగలిగినవారని స్పష్టపడుచుండుట వల్లను హరికారికలకు బాలవ్యాకరణమే మూలమని నా అభిప్రాయము." [1]

నీతిచంద్రిక

ఇది సూరికృతులలో నత్యుత్తమము. వచన కథారచనా విధానమునకు జిన్నయసూరియే శ్రీకారముచుట్టె ననుటకు జరిత్ర పరిశీలకు లొప్పకున్నను నీతిచంద్రికలోని శైలి రసాలవాల మనుట సహృదయ సామాన్యమున కిష్టాపత్తియే. సూరి వాణీదర్పణ మను ముద్రాయంత్రమును నెలకొలిపి నీతిచంద్రిక తొలిముద్రణము 1858లో వేయించెను. వీరేశలింగకవి "చిన్నయసూరి ధీరు లెద జేరిచి సారెకు నాదరింపగా మున్ను రచించిమించె సగము స్వచనంబుగ నీతిచంద్రికన్" అని తానుత్తరార్థము గూర్చెను. కొక్కొండ వేంకటరత్నము పంతులు గారును 'విగ్రహమూ గావించిరి. సూరి వచనములోని సొగుసు వీరిర్వురకును దూరమైనది. మిత్రభేదము మిత్రలాభముకంటె బ్రౌఢము. రచనా

  1. బాలవ్యాకరణ హరికారికల పౌర్యాపర్య విమర్శనము - ఆంధ్ర సాహిత్యపరిషత్పత్రిక సంపుటము 14 - సంచిక 4