పుట:AndhraRachaitaluVol1.djvu/263

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నివాసముచేయుచు మహారాష్ట్రము మాతృభాషవలె ధారాళముగ నభ్యసించిరి. ఆభాషలో 'వీ రనేక వ్యాసములు, పద్యములు రచించినటులు తెలియును 'మౌరోపంత్‌' అనుమహారాష్ట్రకవి వ్రాసిన కర్ణపర్వమునకు మన పంతులుగారు పరిష్కర్తలుగానుండి రన్న విషయము తెలిసినచో వారికాభాషలో గల పాండిత్యము తెలిసినట్లే యగును. వీరేశలింగముగారికి వంగభాషపై నెంతయభిమానమో, మహారాష్ట్రము మీద మనలక్ష్మణరావుగారి కంతమమకారము. ఆ దేశమందలి యభిమానము వీరిచే 'మహారాష్ట్ర విజృంభణము' వ్రాయించినది. ఈయన మధ్యపరగణాలలో బి.ఏ.పట్టభద్రుడై, వంగకళాపరిషత్తులో ఎమ్‌.ఏ.పట్టము బడసిన మేధావి. సంస్కృత పరిచయము కలవాడు. మహారాష్ట్రములో మంచిప్రవేశముగల పండితుడు. ప్రాచీనులను నర్వాచీనులను సమముగా గౌరవించినలౌకికుడు, నైతికముగ తిలకుమహాశయునిశిష్యత్వ మంగీకరించిన బుద్ధిమంతుడు. నిరంతరశాసన పరిశీలనముతోను, నిరంతర చరిత్రపరిశోధనముతోను సంసారమునుమరచిన కర్మశీలి.

'ఆంధ్రబ్రాహ్మణులలోని నియోగి వైదిక భేద కాలనిర్ణయము' - 'కృష్ణరాయలనిధనకాలము' - 'ఏకశిలానగర మోరుగల్లే' - మున్నగు చారిత్రకవ్యాసములు 'త్రిలిజ్గమునుండి తెలుగుపుట్టెనా? లేక తెలుగు నుండి త్రిలిజ్గముపుట్టెనా?' ఇత్యాది భాషావ్యాసములు-ప్రకృతి శాస్త్రము-రసాయనశాస్త్రము-కర్మయోగము-లలితకళలు-పంచాంగము-మున్నగురచనలు లక్ష్మణరావుగారి వివిధవిషయ నివిష్టబుద్ధి కౌశములను, సునిశిత విమర్శన పటుత్వమును వేనోళ్ళ నుద్ఘోషించుచున్నవి. ఎన్నడో 12వ శతాబ్దినాటి శివతత్త్వసారమును ద్రవ్వి దానికి లక్ష్మణరావుగారు వ్రాసిన పీఠికయు దత్పరిశోధనము కనుగొన్నచో వారి శక్తిబహుధా తెల్లముకాగలదు. 'లక్ష్మణరాయ వ్యాసావళి' విజ్ఞానచంద్రికా ప్రతిబింబము.