బొరపడియుండలేదు. పలుసారులు పరిశీలించికాని యేరచనము ప్రచురింపలేదు. కావున నీయనయక్షరములు శిలాక్షరములైనవి. పరిశోధక లక్షణములు వీరికి బూర్తిగ బట్టినవి. పత్రికల కెక్కుట, ఉపన్యాసపీఠములపై గర్జించుట వీరికి లజ్జాకరము. ఈయన సంఘసంస్కారియే కాని వీరేశలింగాదులవలె సంస్కారవాదములో బయటకువచ్చి నడుముబిగింపలేదు. రాజకీయ -సాహిత్యరంగములు రెండింటను ముందడుగువేయు స్వభావ మీయనిది. ఈయనవేషములో నొక విద్యాధికత యుండెడిది. ఆకారము స్వచ్ఛమైనది.
పంతులుగారు గౌరవకుటుంబములోని వారు. పితృపాదులు మునగాలరాజుగారి (శ్రీ నాయని వేంకటరంగారావు బహద్దరు) ముత్తవతల్లిగారియొద్ద 'దివాను' గా బనిచేసిన ప్రసిద్ధాంద్రులు. శ్రీ మునగాలరాజుగారితో లక్ష్మణరావుగారికి బెద్దనేస్తము. పంతులుగారి వలెనే రాజుగారుకూడ భాషాభిమానులు. వీ రిర్వురకు నిరంతర సాహిత్య చర్చలతో గొంతకాలము గడచినది. రావుగారిసద్వర్తనము భాషాపరిజ్ఞానము రాజుగారిమనస్సున కెక్కినవి. దానిచే వారియొద్ద నాంతరంగిక కార్యదర్శిగాను 'దివాను' గాను బనిచేయుట తటస్థించినది. లక్ష్మణరాయరంగరాయులు కృష్ణార్జునులవలె వర్తిల్లిరి. ఉద్యోగముచేయుచున్నను వీరు భాషావలోడనము వీడలేదు. మునగాలరాజువారి సాహిత్యాభిరుచి పంతులుగారి భాషాశాస్త్రపరిశోధనమునకు మీదుమిక్కిలి దోహదమొనరించె నని పెక్కురు వక్కాణింతురు.
లక్ష్మణరావుగారు స్వతంత్రాశయులు. ఛత్రపతిశివాజీకి జన్మదేశమగు మహారాష్ట్రదేశమున బంతులుగారు బాల్య కౌమారదశల గడపిరి. కపయిత్రియగు తనయక్కగారి యాదరమునను, తమబావ బండారు మాధవరావుగారి యభిమానమునను లక్ష్మణరావుగారు నాగపూరు