లేరనికాదు. అవ్యాప్త్వతివ్యాప్తులు లేకుండ స్వల్పాక్షరములు నుండి విశ్వతోముఖమైన యర్థము వచ్చు సూత్రరచనము సూరికి జక్కగ నలవడినదు. ఇది విద్వత్సాధారణమైన యభిప్రాయము.
మును మదుపజ్ఞం బగుచుం
దనరిన వ్యాకృతిని సూత్రతతి యొకకొంతం
దెనిగించి యిది ఘటించితి
ననయము బాలావబోధ మగుభంగిదగన్
అని చిన్నయసూరి వ్రాసికొనెను. అది కాదని గుప్తార్థప్రకాశికా కారులు కల్లూరు వేంకటరామశాస్త్రిగారు "బాలవ్యాకరణము శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి గారి హరి కారికల కనువాదము గాని సూరి స్వతంత్ర రచనము కాదనియు, అబ్రాహ్మణడుగట సూరి కట్టి పాండిత్య విశేషముండ" దనియు వ్రాసి, సూరిని త్రోసిరాజన జూచిరి. తత్వజ్ఞులెవరూ నీవాదము నిరాధారమగుట నంగీకరింపలేదు. "కాళహస్తిలో కృష్ణమూర్తి శాస్త్రి గారికినీ, సూరిగారికినీ జరిగిన వివాదములో శాస్త్రి గారొక విషయమున పరాజితులై సహింపనేరక సూరి బాలవ్యాకరణము నణంచటకు 'హరికారికలు' సంస్కృతమున వ్రాసి బాలవ్యాకృతికిది మాతృకయమని ప్రచారము చేసెడివా " రని జనశ్రుతి. దీని కుపష్టంభకముగా వీరేశలింగము పంతులు గారు 'కవులచరిత్ర' లో కృష్ణమూర్తిశాస్త్రిగారి చరిత్రయం దిట్లు వ్రాసినారు.
" ఈ కృష్ణమూర్తికవి కాళహస్తిలో నున్నపుడు చేయబడిన ప్రధానగ్రంథ మింకొకటి కలదు. ఆ కాలమున నీయనకు చెన్నపురి శాస్త్ర పాఠశాలలో నాంధ్రపండితుడైన పరవస్తు చిన్నయసూరికిని సిద్ధాంతకౌముదిలోని సూత్రవిచారము కొంత నడచెను. మన పండితులు సాధారణముగా మత్పరగ్రస్తులగుట సుప్రసిద్ధమే కదా! అట్టివారీర్ష్యచేత దమకు లాభములేకపోయినను బరులకు నష్టము కలుగుటయే తమ యభీష్టసిద్ధిగా భావించి కొన్ని సమయములందు బరులకీర్తికి భంగము