పుట:AndhraRachaitaluVol1.djvu/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేదు. ఉత్తరములుకూడ నీయన సలక్షణభాషలో రచించెను. సంస్కృతమున వీరి పాండితికి దారకాణగా "స్తవరత్నావళి"నారయవచ్చును. శ్రీశృంగేరి జగద్గురువులు-శ్రీ కుంభఘోణము జగద్గురువులును వీరి గీర్వాణవాణీప్రౌఢిమమునకు మెచ్చి గౌరవించిరి. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారి భారతమునకు వీరువ్రాసిన విపులభూమిక పరికింపదగినది. ఆనందముద్రాలయ, వావిళ్ళముద్రాలయ ప్రకటితములయిన పెక్కుకృతులు కుప్పుస్వామయ్యగారి పీఠికలతో నందగించుచున్నవి.


చెన్నపురి విశ్వవిద్యాలయమున బ్రాచ్యవిద్వద్బిరుదపరీక్ష లుండవలయునని పోరిపెట్టించివారిలో మొదటివా డీవిమర్శకాగ్రేసరుడే. వీరిశిష్యులెందఱోవందలు నేడును చిత్తూరు మండలమున నుండిరని వాడుక.


ఆత్మశ్లాఘ నెఱుగని యీయన శిష్యులు వచ్చి "మేము తమ శిష్యుల" మని చెప్పుకొనునప్పుడు "గురోస్తుమౌనం వ్యాఖ్యానం శిష్యాస్తుచిన్న సంశయా" అని యనువారిని విందుము. కాళహస్తి సంస్థాన ప్రభువులగు శ్రీ దామెర అక్కప్పనాయనింగారికి వీరు కొంతకాల మాంగ్లభాష గఱపిరి. ఈనాగపూడివంశ మందారుని "పారిజాతనపహరణ పరిమళ వ్యాఖ్య" ఆంధ్రసారస్వతమున కపూర్వభూష, వ్యాఖ్యానావతరణమున నీయన యనేక జ్ణేయాంశములు వెలిబుచ్చిరి. ఇది వీరి పాండితికి స్ఫోరకము. అయినను, ఈ వినయవాదము వినదగినది.


తెలిసిన దానిని వ్రాసితి

దెలిసిన వని తలచి వ్రాసితిం దెలియక నా

తెలియమి బొలసిన నలుసుల

దెలిపెద రని తలతు లెస్స తెలిసిన వారిన్.


      -----------