Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తీరును. ఆయుపమలలోను నీచాధికభేదములు పాటింపని యుపమలు. అందులకే వీరి పద్యములు పండిత పామరరంజకములు. ఒక్కొకచో వీరిహాస్యరసము వఱ్ఱోడి పరిహాసాస్పద మగుచుండుటయు గలదు. రాను రాను సాక్షి వ్యాసములలో నీగుణము మనకు గనుపించును. కల్యాణరాఘవము, పట్టభంగరాఘవము, వనవాసరాఘవము, విజయరాఘవము, రాథాకృష్ణ, సారంగధర, సరోజిని, నర్మదాపురకుత్పీయము, విప్రనారాయణ ఇత్యాదులు పౌరాణికములు. ప్రచండచాణక్యము, చూడామణి ఇత్యాదులు చారిత్రకములు. కోకిల, సరస్వతి, వృద్ధవివాహము, మాలతీమాల, రాతిస్తంభము ఇత్యాదులు కల్పితములు. వీరి 'కంఠాభరణము' నాటక వాగ్దేవతకు గంఠాభరణము. వీరికి బౌద్ధవాజ్మయమున గలయభిరుచికి 'బుద్ధబోధసుధ' నాటకమే సాక్షి.


పానుగంటికవి చాటూక్తి చతురుడు. 1922 లో ఆంధ్రసాహిత్యపరిష దేకాదశ వార్షికోత్సవసభకు వీరి నగ్రాసనాధిపతులుగా నెన్నుకొనిరి. అపుడు వా రుపన్యాసారంభమున నిటులుచెప్పిరి.


"........నేనుపండితుండనుగానని యీ యూరివా రెఱుగుదురు. పైగ్రామములవా రెఱుగుదురు. సాహిత్యహీనతలో జగమెఱిగిన వాడను గాని సాధారణుడను గాను. ఇట్టినన్ను బరిషత్తువా రేల యెన్నుకొనవలయునో నాకు దెలియదు. తెలిసిన విషయ మేమియో యంతకంటె దెలియదు. వెనుక జరిగిన పదిపరిషత్సభలకు బండితుల నెన్ను కొంటిమి గదా, యీసారి యపండితు నెన్నుకొందము. ఇంతలో జెడిపోవున దేమున్నదని యూహించి మార్పుకొఱకై నన్నెన్నుకొని యుందురేమో, ఎటులైన నేమి? అవిలంఘ్యమైన మహాజనులయాజ్ఞ తులసీదళము వలె శిరమున ధరించి యిట నిలువబడితిని........"


ఈ సంభాషణ మెంతయభిప్రాయ గర్భితము! లక్ష్మీనరసింహరావుగారు 'స్వీయచరిత్ర' వనవాస రాఘవ రచనము వఱకు వ్రాసికొని రని తెలిసినది. అది తుదముట్టకుండగనే వారుగతించుట తెలుగువారి దురదృష్టము.

                            _______________