ఈ పుట ఆమోదించబడ్డది
కైలాసంబుగదల్ప లోదెలసి త్రొక్కం దావకాంగుష్ఠ రే
ఖాలీలంబడి మోములన్ రుధిర మొల్కన్ మొఱ్ఱలంబెట్టడే!
సర్వారాయకవిగారి నిర్యాణ మతివిచిత్రతరమైనది. 1939 మార్చి 13 వ తేదీ సోమవారము యథాపూర్వముగ మేలుకొని నిత్యకృత్యము దీర్చెను. తీర్చి సూర్యనారాయణస్తుతి పఠించి స్నానముచేసి, ధౌత వస్త్రములు కట్టి దేవతార్చనముచేసి భోజనము మాత్రము చేయక భూమిమీద ప్రాక్ఛిరముగ శయనించి తనువువిడిచిరి. ఇట్టి యెఱిగిన మరణ మెవరికో గాని తటస్థింపదు. వీరికి జ్యోతిశ్శాస్త్రమున మంచి ప్రవేశమున్నది. ఆకారణమున నిర్యాణతిథి తెలిసికొని యిటులు జ్ఞానివలె మరణించెను.
____________