Jump to content

పుట:AndhraRachaitaluVol1.djvu/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాదెళ్ల పురుషోత్తమ కవి

1863 - 1938

హరితసగోత్రులు. తల్లి. సుబ్బమాంబ: తండ్రి. కామయార్యుడు. జన్మస్థానము కృష్ణాతీరస్థమగు సీతారామపురాగ్రహారము. జననము: 1863 సం|| ఏప్రిలు 23 గురువారము. నిర్యాణము 27-11-1938 సం|| బహుధాన్యమార్గశీర్ష శుద్ధ పంచమి-ఆదిత్యవారము. గ్రంథములు: ఆంధ్ర ప్రబంధములు: 1. అద్భుతోత్తర రామాయణము. 2. గురుభక్తి ప్రభావము 3. కృష్ణానదీ మహాత్మ్యము 4. యాదవాద్రీశోపాఖ్యానము. 5. మహేంద్ర పురాణము 6. యామినీ వినోదము 7. బభ్రువాహన చరిత్ర 8. రంగదాసీయము 9. చతుర్ముఖి కందపద్య రామాయణము. ఆంధ్ర రూపకములు: 1. అహల్యా సంక్రందన నాటకము 2. హరిశ్చంద్ర నాటకము 3. పారిజాతాపహరణము 4. సారంగధర నాటకము. ఇత్యాదులు. శతకములు: 1. సీతారామశతకము 2. పూర్వకర్మ శతకము 3. మల్లికార్జునశతకము మున్నగునవి, మరియు. స్తోత్రకృతులు, అభివర్ననములు, కీర్తనలు, నిఘంటువులు, శాస్త్ర గ్రంథములు, హిందీనాటకములు మొత్తము 112 గ్రంథములు గలవు. వీరి విశేషవిషయములు తెలియుటకు శ్రీ నాదెళ్ళ మేథా దక్షిణామూర్తి శాస్త్రిగారు సంధానించిన " ఉత్తమ యోగివృత్తము " అను కూర్పు పరికింపవలయును.

కవిత్వ మొకకళ. కళకును శాస్త్రమునకును నెంతో యంతరము. తొలినాడు శాస్త్రకారునకు జూపిన గౌరవప్రపత్తులు, కళాకారునకు జూపలేదనుట వాస్తవము. నటవిటగాయకుల గణములోనే కవుల పరిగణనము. నేడు తలక్రిందులై కళాజీవులు గద్దెలకెక్కి కొండాడబడు చుండుటయు, శాస్త్రజీవులు అజ్ఞాతులై మూలలనుండుటయు జరుగుచున్నది. దీనిలోరహస్యము, కళ వలన బ్రతుకువానికడ నాముష్మికదృష్టి లోపించి యుండువల్ల నేమోయని తోచును. కళగాని, శాస్త్రముగాని తాత్త్విక సరణికి గొనిపోవలయును. అపుడు, ఆకళాకారుడు, ఆ శాస్త్రకారుడు నేక శ్రేణిలో గూర్చుండుటకర్హులగుదురు.