మేడేపల్లి వేంకటరమణాచార్యులు
1862 - 1943
గోలకొండవ్యాపారి వైష్ణవుడు. భారద్వాజసగోత్రుడు. ఆపస్తంబసూత్రుడు. తండ్రి: రఘునాథాచార్యులు. తల్లి: లచ్చమాంబ. జననము: 10-7-1862 సం. నిర్యాణము: 1943 సం. వీరి పూర్వుల నివాసము అనకాపల్లి (విశాఖపట్టనము జిల్లా). వీరి నివాసము: విజయనగరము. గ్రంథములు: పార్థసారధి శతకము, దేవవ్రత చరిత్రము (ప్రబంధము), సేతుబంధ మహాకావ్యము (ప్రవరసేన రచిత ప్రాకృతకావ్యమున కాంధ్రపరివర్తనము), అలంకారశాస్త్ర చరిత్రము, హర్షచరిత్రము (వచనము), లౌకికన్యాయ వివరణము. సంస్కృతకృతులు: షేక్స్పియరు నాటకకథలకు సంస్కృతానువాదము, వకుళాభరణుల ద్రావిడగాథా సహస్రమునకు సంస్కృత శ్లోకములు- ఇత్యాదులు.
వేంకటరమణాచార్యులుగారు ప్రబంధకవి. ప్రాచీన సంప్రదాయములు దాటకుండ 'దేవవ్రతచరిత్రము' పద్య కావ్యముగా రచించిరి. కవిత్వము నాతికఠినముగ నుండి రసవంత మని పెక్కుపండితులచే బ్రశంసింపబడినది. గ్రంథకర్తలు సంస్కృతాంధ్రములయందు దలస్పర్శియగు పరిజ్ఞానముకలవా రగుటచే నిందెన్నియో ప్రయోగవిశేషములు వాడిరి. 'చేతు' మున్నగునవి ధారాళముగా నుపయోగించిరి. ర. ఱ లకుబ్రాసములు ర. ల లకుయతులు, అఖండవిరామములు వీరు త్రోసివేయలేదు. భీష్మునిచరిత్రము నింతకుముందు రచించినవారు లేరు. భీష్మునిచరిత్రమేగాక సందర్భానుసారముగా ద్రౌపదీవస్త్రాపహరణాదు లభివర్ణితములు, తిక్కనకు వచ్చినట్లే యీకవికి గల వచ్చినది. కలలో శేషశైలపతి కనబడి దేవవ్రతచరిత్రము రచింపుమని చెప్పెనట. స్వప్నవృత్తాంతము, షష్ఠ్యంతములు మున్నగునిబంధనములను మీఱక నగరార్ణవశైలర్తుచంద్రార్కోదయాది సమస్త వర్ణనములు గావించి వీరరసప్రధానమైన యీప్రబంధము భావ భాషా బంధురముగా విరచించిరి.