పుట:AndhraRachaitaluVol1.djvu/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దగిన--భాషాసంస్థలు రెండు మూడు మాత్రమే తెలుగున గలవు. పరిషత్తు సేవాఫలిత మంతయు రామయ్యపంతులుగారిచేతను, పంతులుగారి గౌరవసేవయంతయు బరిషత్తుచేతను బెక్కువత్సరము లనుభవింప బడుచు వచ్చినది. ఆంధ్రసాహిత్యపరిషత్తును కొమార్తెగాను, సూర్యరాయాంధ్ర నిఘంటువును గుమారునిగాను భావించుకొని పంతులుగారు తమయనపత్యతావ్యథను బావుకొని మనుగడ సాగించినారు.

రామయ్యపంతులుగారు బి.యె. పట్టభద్రులు. చదువుచున్న సమయమున వీరిబుద్ధివిశేషమును వెలిబుచ్చు విశేషమొకటి వారి పెద్దలిట్లు చెప్పుకొందురు. బ్రహ్మసమాజమత ప్రబోధకుడగు పండిత శివనాథశాస్త్రి మతప్రచారమునకు 1881 లో రాజమహేంద్రవరము వచ్చి యాంగ్లేయభాషలో గంభీరోపన్యాసము గావించెనట. ఆకాలమున క్లుప్తలేఖనము లేకుండుటచే నెట్టియుపన్యాసములైన నచ్చులోనికి వచ్చుట కవకాశముండెడిది కాదు. మనపంతులుగా రప్పుడు రూళ్ల పెనిసిలు కాగితములు పుచ్చుకొని తూచాలు తప్పకుండ శివనాథశాస్త్రిగారి యుపన్యాసము లన్నియు వ్రాసి చెన్నపురిలోని యాంగ్ల పత్రికలకు బంపిరట. శివనాథశాస్త్రిగారు తమ యుపన్యాసములు యథాతథముగా నాపత్రికలలో వెలువరింపబడుట గని యబ్బురపడి యివి వ్రాసిన వారెవరని తెలిసికొన - బి. యె. తరగతి విద్యార్థి జయంతి రామయ్య వ్రాసె నని తేలినది. అప్పుడెల్లరు "ఈ చికిలికన్నుల చిన్నవాడేనా గంగాప్రవాహము బోలు నీమహోపన్యాసము వ్రాసినది" అని యాశ్చర్యచకితు లైరట. పంతులుగారు చిన్ననాట గన్నులు చికిలించెడివారని యెఱిగినవారు చెప్పుచుందురు.

రామయ్యపంతులుగారు 1886 లో బి.ఎల్. పరీక్షలో నుత్తీర్ణతనందిరి. ఆనాటి విచిత్ర మొకటి వీరినిగూర్చి చిలకమర్తి లక్ష్మీనరసింహముగారు చిఱునవ్వునవ్వుకొనుచు నిట్లుచెప్పుచుందురు. "రామయ్య