పుట:AndhraRachaitaluVol1.djvu/173

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఈపద్యము చదివి యాహూతులు కొందరు వేగన్ విధిన్ అనుపదముల కర్థ మెఱుగక వ్యర్థపదములని యాక్షేపించిరట. సహజసాత్త్విక స్వరూపులగుశాస్త్రులుగారు నవ్వుకొని వేగన్ అనగా దెల్లవారుజామనియు, విధి యనగా రోహిణీనక్షత్రమనియు వారి కెఱుగ జెప్పిరట వీరికవిత్వములోనేగాక మాటలలోగూడ నిట్టిపొందికయు జమత్కారములు నుండును. 'తమకు జీత మెంతయిత్తురండి' యనియడుగ 'వయసునకు మించలేదు లెండి' యనుచుండువారు.

ఈ శాస్త్రులవారు వేదుల సోమనాథశాస్త్రులవారితో దర్కాలకారశాస్త్రములు చదివిరి. ఉపనిషద్వేదాంతములు ఆదిభట్ట రామమూర్తి శాస్త్రులవారిసన్నిధిని పఠించిరి. వీరు మొట్టమొదట ఖండవిల్లిలోను, క్రొత్తపేటలోను గల పాఠశాలలోను నధ్యాపకులై యుండిరి. తరువాత 1880 మొదలు 1915 వఱకు రాజమహేంద్రవరము బోధనాభ్యసన పాఠశాలా కళాశాలలలో సంస్కృత భాషాదేశికులై విద్యార్థుల నెందఱనో విద్వాంసుల నొనర్చి యుపకారవేతనము గొన్నారు.

వీ రనువదించిన అనర్ఘ రాఘవము - ప్రబోధచంద్రోదయము సూర్యశతకము చూచిన కవిప్రతిభాపాండిత్యాదులు వెల్లడియగును. 'భారత ఫక్కి' యనుపేర భారతముపై విమర్శ గ్రంథము నొండు వ్రాసిరి. అది భాషోపానకుల కుపయోగకరమైన కూర్పు. వ్యాసమూర్తిశాస్త్రిగారి భారతనవనీతము సంపూర్ణముగ నచ్చునకు వచ్చునట్లు వ్యానేశ్వరుడనుగ్రహించుగాక ! పీఠికాపుర సంస్థానకవులు శతావధానులునగు వేంకట రామకృష్ణకవులలో నొకరగు వేదుల రామకృష్ణశాస్త్రిగా రీమహాభారత నవనీతకవికి అల్లుడని వెల్లడించుట యవసరము.

అదియటుంచి, శాస్త్రులుగారి సూర్యశతకము తెనుగు సేత నుండి గొప్పపద్యములు కొన్ని యెన్ను కొందము.