పుట:AndhraRachaitaluVol1.djvu/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్వము నాపాదించి తొలుదొల్త స్వతంత్రనాటకములు రచించినావాడగుటచే నీ కవివరున కీబిరుద మన్వర్థ మని నాడు పెక్కుపండితు లగ్గించిరి. పురప్రముఖులు ముగ్దులై యొక కిరీటమర్పించిరి. ఆచార్యుల వారు నాటక కర్తలేకాక నటకులు కూడాను. చిత్రనళీయములో బాహుకుడు, విషాదసారంగధరములో రాజనరేంద్రుడు, పాదుకాపట్టాభిషేకములో దశరథుడు, అభిజ్ఞానమణిమంతములో దుష్టబుద్ధి, ఈ పాత్రములు ప్రత్యేక ప్రశంసాపాత్రములుగా నటించెడివారు. దశరధ పాత్రధారిత్వమున కృష్ణమాచార్యులవారికి సాటి కృష్ణమాచార్యులవారే యని పలువురు చెప్పుకొందురు. ఆచార్యులవారు తమ మరణము నాటక రంగముననో న్యాయస్థానముననో యుండునని యప్పు డప్పు డనుచుండువారు. అది తధ్యముగ వారు 1912 లో నొక యభియోగము నడపుటకు వెళ్ళి 'ఆలూరు ' లో న్యాయస్థానమున నాకస్మికముగ గాలు జారిపడి 'రామచంద్రా' యనుచు నసువులు బాసిరి. వారి మృతకళేబరము నాలూరునుండి బళ్ళారికి దెచ్చి యంత్యక్రియ నడవు సందర్భమున జరిగిన యూరేగింపుటుత్సవము పలువు రిప్పటికి చెప్పుకొందురు. నాటకాచార్యుడై గడించిన కీర్తియు, న్యాయవాదియై సంపాదించిన పేరును నాడు ప్రకటితమైనవి. స్త్రీలు పురుషులు వృద్ధులు యువకులు నొక రననేమి, వేలకొలది పుష్పమాలికాదులచే నాచార్యకవి కంత్యసమ్మాన మొసంగిరి. ఇట్టి మహాశయుని శక్తి యుక్తులు ముచ్చటించు కొందముగాక !

కృష్ణమాచార్యులవారి తండ్రిగారు మంచి పండితులు. తాత ముత్తాతలుకూడ విఖ్యాత విద్వాంసులు. తండ్రిగారు బళ్ళారి "వార్థ లా కాలేజి లో నాంధ్ర పండితపద మలంకరించిరి. జనకుని సన్నిధినే కృష్ణమాచార్యుడు సంస్కృతాంధ్రములు కఱచెను. మేధాశక్తి గొప్పది యగుట నిట్టే చక్కని సాహిత్వమలవడుట తటస్థించినది. దానివలన బహుగ్రంథపరిశీళనము గావించి పాండిత్యమునకు స్వయముగా మెఱుగు