పుట:AndhraRachaitaluVol1.djvu/105

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శాకుంతలము పంతులుగా రనువదించి 1883 లో నావిష్కరించిరి. అది మొదలు వేదము వేంకటరాయశాస్త్రి ప్రభృతులు పదిమందివఱకు నా నాటక మెవరిశక్తికొలది వా రాంధ్రీకరించికొనిరి. వీరేశలింగముగారి ఆంధ్రశాకుంతలము రంగస్థలములకెక్కి యనేకులచే నభినందింప బడినది.

చల్లనివై శ్రమం బడవజాలిన తామరపాకు నీవనల్
మెల్లన గొంచు వీచుదునో మిక్కిలిశీతలమైన నాయువుల్
సల్లలితారుణాబ్జ సదృశంబగు నీచరణద్వయంబు నో
పల్లవపాణి! నాతొడలపై నిడి హాయిగ బట్టువాడినో?

కొందలమందెడెందము శకుంతల తానిపు డేగునం చయా
క్రందుగ బాష్పరోధమున గంఠమునుంజెడె, దృష్టిమాంద్యముం
బొందె నొకింతపెంచిన తపోధనులే యిటుకుంద నెంతగా
గుందుదురో తమంత గనుకూతుల బాయు గృహస్థులక్కటా!

ఇత్యాది పద్యములు తెలుగున మఱుమ్రోసినవి. శాకుంతలమేగాక ప్రబోధచంద్రోదయము, మాళవికాగ్నిమిత్రము, రత్నావళి మున్నగు నాటకము లాంధ్రీకరించిరి. ఆంగ్లేయనాటకముల బట్టి చమత్కార రత్నావళి, కల్యాణ కల్పవల్లి, రాగమంజరి అనువానిని రచించిరి. ప్రహ్లాద దక్షిణగోగ్రహణాది పురాణ నాటకములు వ్రాసిరి.

పంతులుగారు కృతికర్తలేకాక, ప్రాచీనమహాగ్రంధముల నెన్నిటినో ముద్రింపించిన భాషాపోషకులు కూడను . నాచనసోమనాధుని యుత్తర హరివంశము, అనంతుని భోజరాజీయము, చఱిగొండధర్మన చిత్రభారతము, నందిమల్లయ, ఘంట సింగయకవుల వరాహ పురాణము, నారాయణకవి పంచతంత్రము, కాకమాని మూర్తి పాంచాలీ పరిణయము,మొల్లరామాయణము మున్నగు కబ్బములకు వీరేశలింగము పంతులుగారే తొలుత నచ్చు వెలుగు చూసి పున్నెము గట్టుకొనిరి.

వీరేశలింగముగారికి దొల్లి తెలుగులో ప్రహసనములు లేవు."చంద్రరేఖావిలాసము" వంటి తిట్టుకవితలు మాత్రము గలవు. సంస్కృతమున