పుట:AndhraKavulaCharitamuVol2.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్రుండు దురత్యయోరుభవదోషవిదూర మన:ప్రచారుడై


మండగి మాదిరాజు గుణమండితవందితు డొప్పు నప్పురిన్- [ఆ.1]

ఉ. పట్టకు పట్ట కింక వృషభం బది మాటలు చెల్లినప్పుడే

పెట్టితి లింగముద్ర యదె బీరము తప్పగ బట్టి తేనియున్

గొట్టుదునీశిరంబు ధర గూలగ మాబసవన్న యాన చే

పట్టుల గాచుటెల్ల శివభక్తులకున్ బిరుదంబుగావునన్- [అ.5]


శా. ఆనందాశ్రుపయోధి నిట్టవొడువన్ హర్షోత్థరోమాంచస

శ్రీ నెమ్మేనికి భూషణంబుగ లసద్గ్రీవోద్గమద్గద్గద

ధ్వానమ్ముల్ గురుకర్ణసత్వములుగా దాత్సర్యమున్ భక్తియున్

లోనన్ గీల్కొనియున్న యాత్మసుతు నాలోకించి మై పెంచుచున్- [ఆ.7]


                               _______


15. పిడుపర్తి బసవకవి


ఇతడు శైవబ్రాహ్మణుడు. బసవపురాణమును పద్య కావ్యముగా రచియించిన సోమనాధుని తమ్ముడయిన పాలనార్యుని పుత్రుడు. కాబట్టి యీకవియు నించుమించుగా సోమనాధుని కాలమునందే యున్నవా డగుటచేత 1520 -వ సంవత్సర ప్రాంతమునం దున్నవాడని చెప్పవచ్చును. ఇతడు పాల్కురికి సోమనాథుడు రచియించిన ప్రభు లింగలీలను తెనుగున నైదాశ్వాసముల పద్యకావ్యముగా రచించెను. ఈ బ్రభు లింగలీలయందు బసవేశ్వరునికిని బసవేశ్వరుని మేనల్లుడయిన చెన్న బసవన్నకును గురువయిన యల్లమప్రభుడను జంగమదేవరయొక్క కథ చెప్పబడియున్నది. పిడుపర్తి బసవకవియొక్క కవనవిధము తెలియుటకై ప్రభులింగలీలనుండి రెండుమూడు పద్యముల నుదాహరించు చున్నాను.-