పుట:AndhraKavulaCharitamuVol2.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భంగము చేసె ననియు, మఱియొకకథ చెప్పుదురు. కొంచెము మంచి గ్రంథమును రచించిన కవికెల్ల నతని యిష్టదేవతయో సరస్వతియో వచ్చి గ్రంథరచనము చేసి పెట్టినట్లుగా మనలో జెప్పుకొనెడు వాడుక ప్రకారముగా రామభద్రకవికిని రాజువొద్ద దా నాఱునెలలలో గ్రంథమును జేసి తెచ్చెదనని ప్రతిజ్ఞనుపట్టి తేలేక పోయినప్పుడు మితిపెట్టిన కడపటి దినమురాత్రి యాతని యిష్టదైవమయిన శ్రీరామమూర్తియే రామాభ్యుదయమును జేసిపెట్టి కవియొక్క మానము కాపాడెనని జనప్రతీతి యొకటికలదు. సకలకథాసారసంగ్రహమునందున్న రీతి పద్యములలో ననేకము లీరామాభ్యుదయము నందు గానబడుచున్నవి. వానిలోనొక్కదాని నిందుదాహరించుచున్నాను-


సీ. కానకకన్న సంతానంబుగావున

గానకకన్న సంతానమయ్యె,

నరయ గోత్రనిధానమై తోచుగావున

నరయ గోత్రనిధానమయ్యె నేడు,

ద్విజకులాదరణవర్ధిష్ణుండు గావున

ద్విజకులాదరణవర్ధిష్ణు డయ్యె,

వివిధాగమాంతసంవేద్యుండు గావున

వివిదాగమాంతసంవేద్యు డయ్యె

గటకటా దాశరథి సముత్కటకరీంద్ర

కటకలితదానధారార్ద్రకటకమార్గ

గామి యెట్లుచరించు నుత్కటకరీంద్ర

కటకలితదానధారార్ద్రకటకతటుల.


ఈకవి రేఫ శకటరేఫములభేదమును పాటింపక యతిప్రాసములందు యథేచ్ఛముగా మైత్రి కలుగ జేసినవాడు. ఈతని కవిత్వరీతి దెలుపుట కయి రామాభ్యుదయములోని కొన్ని పద్యములు నిందు వ్రాయుచున్నాను-