పుట:AndhraKavulaCharitamuVol2.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కథాసారసంగ్రహము శ్రీరామ పురూరవశ్చరిత్రాదులనుగల తొమ్మిది యాశ్వాసముల గ్రంథముగా నున్నది. ఈగ్రంథమునందును రామభద్ర కవి సూక్ష్మబుద్ధి గలవాడని యూహించుటకు దగినమార్గము లనేకములు గానబడుచున్నను, కవిత్వము ప్రౌడముగాక వ్యాకరణదుష్టమయి బాలవిరచిత మని సూచించుచున్నది. 1530 వ సంవత్సరమున కొకటి రెండేండ్లుముం దీకవి గ్రంథరచనకారంభించినట్లు తోచుచున్నది. ఈకవి సకల కథాసారసంగ్రహముయొక్క యవతారికయందు దాను గ్రంథరచన చేయబూనుటనుగూర్చి యీక్రిందిపద్యమును వ్రాసి యున్నాడు-


ఉ. నన్నయ తిక్కనాదికవినాథులు చెప్పినయట్లు చెప్పలే

కున్న దదుత్తరాంధ్రకవు లూరకయుండిరె తోచినట్లు ని

త్యోన్నతబుద్ధి గబ్బములు యోజ రచింపక యందు జ్ఞానసం

పన్నులకావ్యముల్ హరిసమర్పణమై జెలువొందు నెందునన్.


ఈబాలకావ్యమయిన సకలకధాసారసంగ్రహమునుగూర్చి యిందు విస్తరించి వ్రాయక యందలి పద్యములను మాత్రము రెంటిమూటి నిందుదాహరించు చున్నాను.


సీ. కానకకన్న సత్సూనుండు నేటికి

గానకకన్న సత్సూను డయ్యె

బుణ్యజనోత్కీర్ణ పురుషుండు నేటికి

బుణ్యజనోత్కీర్ణ పురుషు డయ్యె

ద్విజముఖ్యులనుగూడితిరుగుబాలుడు నేడు

ద్విజముఖ్యులనుగూడి తిరుగుటయ్యె

గోత్రపావను డైనకొమరుండు నేటికి

గోత్రపావను డైనకొమరు డయ్యె