పుట:AndhraKavulaCharitamuVol2.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మజ్జన మార్చు నార్చు నభిమానము రోతల కియ్యకొల్పు నీ

ముజ్జగ మైన ద్రిప్పు దుదిముట్టదు తా ధనకాంక్ష యేరికిన్- [ఆ.5]


ఉ. ఏకడజొచ్చునో సుకృత మెచ్చటడాగునొ తృప్తి యెప్పుడో

పోకడ శాంతి కెం దడగిపోవునో సౌఖ్యము మాన మేమియౌ

నో కృప యెట్లు మాయ మగునో యశ మేగహనంబుదూఱునో

లోకమునం దెఱుంగ మొకలోభ మెదిర్చినమాత్ర జిత్రమై- [ఆ.5]


ఉ. ఖండసుధాకరాలికలు గాడవిరక్తి దపస్విశిష్యలై

యుండిరి పూవుదప్పుటకు నుల్లము రోసి రతీశు డిక్షుకో

దండము బుష్పబాణములతండము బాఱగవైచి చేతులన్

దండమునుం గమండలువు దాలిచి మస్కరి గాకయుండునే- [ఆ.6]

                         ___________


8. కాసె సర్వప్ప

ఇతడు సిద్ధేశ్వరచరిత్ర మనునామాంతరముగల ప్రతాపచరిత్రమును ద్విపదకావ్యముగా రచించెను. ఈకవికాల మెప్పుడో నిశ్చయముగా దెలియదుగాని యితని గ్రంథము మిక్కిలి పురాతన మైనదనుటకు సందేహములేదు. ఇతడు ప్రతాపరుద్రుని యనంతరమున గొంతకాల మయిన తరువాత నుండినవాడు. ఈతని కవిత్వమునందు లక్షణవిరుద్ధము లైన ప్రయోగము లనేకములు గానబడుచున్నను, చరిత్రముగా నీగ్రంథము మిక్కిలి యుపయుక్త మయినది. ఈతని గ్రంథము నుండియే కూచిమంచి జగ్గకవి తనసోమదేవరాజీయము నందు విశేష భాగముగ్రహించి యున్నాడు. తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంథమునుండి కొంతభాగ ముదాహరింపబడినందున, ఇందుండి యిప్పుడు గొన్నిపంక్తులు మాత్రమే గ్రహింపబడును.