పుట:AndhraKavulaCharitamuVol2.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మును తిమ్మకవియు, రాజుముందఱ బెట్టి సమర్పించిరట ! రాజు వారి యౌదార్యమునకును సరసత్వమునకును మెచ్చి యిరువురకును నర్హ బహుమతులుచేసి సత్కరించి పంపెనట!

రాయల యాస్థానమునందు గొంతకాల మొకబట్టుకవి ప్రబలుడుగా నుండి యితరకవులను సరకుగొనక యవమానించుచుండగా పెద్దనాది కవులందఱును గూడి యొకనాడు తిమ్మకవి వాకిట గూరుచుండి యాలోచించుచుండిరనియు, అప్పుడాబట్టామార్గమున బోవుచు వారిని జూచి వారికి వినబడునట్లుగా దనభటుడైన మాధవునితో


క. వాకిటికావలి తిమ్మని | వాకిటికవికోటి మాధవా కిటికోటే

అనిపలికి పరిహసించెననియు, అదివిని కుపితుడయి యాంధ్ర కవితా పితామహుడైన యల్లసాని పెద్దన

క. ప్రాకృత సంస్కృత ఘుర్ఘుర | మూకీకృతకుకవితుంగముస్తాతతికిన్

వాకిటికావలి తిమ్మన | వాకిటికవికోటి మాధవా కిటికోటే.


అని పద్యమును బూరింపగా బట్టుకవి సిగ్గుపడి తలవంచుకొని పోయెననియు ఒక కథను జెప్పుచున్నారు. వాకిటికావలి తిమ్మన నంది తిమ్మన కాడనియు అతడు రాజునొద్ద సేనాధిపతిగానుండి దుర్గసంరక్షణము చేయుచుండు మఱియొక తిమ్మనయనియు, అతడొకనాడు రాజభవనము వాకిట రాజిచ్చిన యమూల్యవస్త్రమును గప్పుకొని కావలి కాచుచుండగా రాజదర్శనార్ధము లోపలికి బోవుటకయి యచ్చటి కల్లసాని పెద్దనయు, ముక్కుతిమ్మనయు, బట్టుమూర్తియు, తెనాలి రామకృష్ణుడును వచ్చి యాతనిజూచి వారిలో బెద్దన మొదట


క. వాకిటి కావలితిమ్మా

అని పద్యము నారంభించి లోపలికి బోయెననియు, అటుపిమ్మట నందితిమ్మన

ప్రాకటముగ సుకవివరులపాలిటి సొమ్మా