పుట:AndhraKavulaCharitamuVol2.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అను ముక్కునువర్ణించిన యీ పద్యమును తిమ్మకవి రచియించెననియు, ఈపద్య చమత్కృతిని జూచి మెచ్చి రామరాజభూషణుడు నాలుగువేల వరాలిచ్చి కొని తన వసుచరిత్రమునందు వేసికొనియెనినయు, ముక్కుమీది యీ పద్యమును రచించుటచేతనే యీ కవిని ముక్కుతిమ్మన్న యని యెల్లవారును వాడుచు వచ్చిరనియు, లోకప్రవాదము కలదు. కాని యిదియు గవులను గూర్చి మనవారు సాధారణముగా జెప్పుకొను కల్పనాకథలలో జేరినదేకాని నిజమయినది కాదు. మొట్టమొదట రామరాజభూషణు డీకవికాలములో లేనేలేడు, ఒకవేళ నున్నాడనుకొన్నను వసుచరిత్రమువంటి మహాబ్రబంధమును రచియింప గలిగిన కవిగ్రామణి యింతమాత్రపు కల్పనను నాసికా వర్ణనముగూర్చి చేయలేకపోయెననుట పరిహాసాస్పదము. కాబట్టి యీ కథ యణుమాత్రమును విశ్వాసపాత్ర మయినదిగాదు. కాకపోయినయెడల నందివారని యింటిపేరుగల యీ కవిని ముక్కుతిమ్మన యని జనులేలపిలుతురని కొంద ఱడుగవచ్చును. ఈ కవికి ముక్కు పెద్దదనియు, అందుచేత నీతని నెల్లవారును ముక్కుతిమ్మన్న యని పిలుచుచు వచ్చిరనియు, ఇంకొక వాడుక గూడ గలదు. ఈతనిని ముక్కుతిమ్మన్నయని యాడుట కిదియే నిజమయిన కారణము కావచ్చును. ఈతనిపలుకులు ముద్దులు గులుకు చుండుటచేత నిటీవలివారు "ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకు" అని గ్రంథములయందీతని మృదుపదరచనను శ్లాఘించియున్నారు. తిమ్మన కృతమయిన పారిజాతాపహరణము మృదుమధుర పదములతో రసిక జనహృదయరంజకముగా గూర్పబడినది

అల్లసానిపెద్దన నొక్కని విడిచిన పక్షమున గృష్ణదేవరాయ లీతనినే యెల్ల కవులకంటె నధికముగా గౌరవించుచు వచ్చెనని చెప్పవచ్చును. పెద్దనకృతమైన మనుచరిత్రమువలెనే తిమ్మనకృతమైన పారిజాతాపహరణ ప్రబంధమును గృష్ణదేవరాయనికే యంకితము చేయబడినది. ఇందు