పుట:AndhraKavulaCharitamuVol2.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రకవుల చరిత్రము.

మధ్యకవులు

కృష్ణదేవరాయలు

ఇత డాముక్తమాల్యద యను నామాంతరముగల విష్ణుచిత్తీయ మనుప్రబమంధమును రచించిన మహాకవి. ఇతడు కవీశ్వరు డయి విద్వ న్మహాకవుల నాదరించుట వలననేకాక మహారాజయి యనేక దేశములను జయించుటవలన గూడ సుప్రసిద్ధు డయినవాడు. దక్షిణహిందూ దేశమును పాలించినరాజులలో నింతదేశమును జయించి యేలినవాడును, ఇంత ప్రసిద్ధి కెక్కినవాడును, మఱియెవ్వడును లేడు. కాబట్టి యీతని చరిత్రమును వ్రాయుటకుముం దీతని పూర్వచరిత్రమునుగూడ సంక్షేపముగా గొంతవ్రాయుట యుచితమని తోచుచున్నది. ఈతని రాజధాని బళ్ళారిమండలములోని యానెగొందికి సమీపమున తుంగభద్రాతీరమునం దున్న విజయనగరము. ఈవిజయనగరమునకు విద్యానగరమనియు నామాంతరము గలదు. ఈపట్టణము విద్యారణ్యస్వామియని మహాప్రసిద్ధిగన్న మాధావాచార్యులవారి యాజ్ఞచేత గట్టబడినది. ఈమాధవాచార్యు లాకాలమునందు బుక్కరాజువద్ద మంత్రిగా నుండెను. కంపభూపతి కుమారుడైన బుక్కరాజు క్రీస్తుశకము 1379 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసెను. ఈరాజు హూణశకము 1336 వ సంవత్సరము మొదలుకొని 1350 వ సంవత్సరము వఱకునుగూడ తనయన్నయైన హరిహర రాజుతో గలిసి రాజ్యము చేసెననియు, ఆకాలమునందు గూడ మాధవాచార్యుడే వారికి మంత్రియనియు, వారికిరాజ్యము మాధవాచార్యుని