పుట:AndhraKavulaCharitamuVol2.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాత్రము తెనిగించిరి. ఈతడే మార్కండేయ పురాణమునుండి స్వారోచిష మనుసంభవ కథను గైకొని పెంచి స్వకపోలకల్పనతో మొట్టమొదట మనుచరిత్రమును బ్రబంధరూపమున రచియించిన కవి యగుట చేత నీతని కాంధ్రకవితాపితామహు డన్న బిరుదనామము కలిగినది. ఈతనికాలము మొదలుకొని రామరాజభూషణుడు వసుచరిత్రము చేయువఱకును గల కవులందఱును జాలవఱకు దమ ప్రబంధములను మనుచరిత్రరీతినే చేసిరి. ఈ కవి జన్మముచేత స్మార్తుడే యయినను, నడుమ వైష్ణవము పుచ్చుకొని వైష్ణవాగ్రేసరుడయి విష్ణ్వాలయములకు భూదానాదులను జేసెను. ఈవిషయమే యెకంజీ దొరవారు సంపాదించి యుంచిన రాజకీయప్రాగ్దేశపుస్తక భాండాగారమునందలి వ్రాతపుస్తక ములయందు దెలుపబడియున్నది. అందున్న కోకటాగ్రహారమును గూర్చిన యంశము నిందు క్రింద వ్రాయుచున్నాను-


"అల్లసాని పెద్దయ్యంగారు బ్రాహ్మణుడు, నందవరీకుడు, చొక్కరాజుగారి కొమారుడు. కోకటగ్రామమును శ్రీకృష్ణదేవరాయలవారీ కవీశ్వరుని కియ్యగా, అతడు వైష్ణవము పుచ్చుకొని యీగ్రామము శ్రీవైష్ణవుల కగ్రహారము చేసియిచ్చెను. అప్పుడు దానికి పెట్టినక్రొత్తపేరు శఠగోపపురము. ఈ కవి శాలివాహనశకవర్షములు 1440 బహుధాన్యసంవత్సర వైశాఘశుద్ధ 15 లు నాడు ఈ గ్రామమునందుండు పకలేశ్వరస్వామికి నైవేద్య దీపారాధనలకై రెండు పుట్లచేను ధారపోసియిచ్చి సదరు దేవాలయములో శిలాశాసనము వేయించినాడు. పయిసంవత్సరము కార్తికశుద్ధ12 శి నాడు చన్నకేశవస్వామికి నాలుగున్నర పుట్లభూమి ధారపోసి శాసనము వేయించినాడు...... కృష్ణదేవరాయలతర్వాత సదాశివదేవరాయల కాలములోను, రామరాయలకాలములోను, నంద్యాలరాజైన మట్లఅనంతరాజు కాలములోను కోకటాగ్రహారము బ్రాహ్మణులకు జెల్లెను."