పుట:AndhraKavulaCharitamuVol2.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. అల్లసాని పెద్దన్న

అల్లసాని పెద్దనార్యుడు నందవరీక నియోగిబ్రాహ్మణుడు; చొక్కనామాత్యుని పుత్రుడు; బళ్లారి ప్రాంతములయందున్న దూపాడు పరగణాలోని దొరాలగ్రామ మీతని జన్మస్థలము; కృష్ణదేవరాయల యాస్థానకవీశ్వరులలోనెల్ల నితడు ముఖ్యుడు. ఈతడు కృష్ణదేవరాయల యనంతరముగూడ కొంతకాలము జీవించుయుండుటచేత, ఇంచుమించుగా 1535 వ సంవత్సరము వరకును బ్రతికియుండెనని చెప్పవచ్చును. కృష్ణదేవరాయలు మృతి నొందిన తరువాత నీతడు చెప్పిన జాలిని పుట్టించెడి యీక్రింది పద్యమీతడు రాయలయనంతరమున జీవించియున్నట్టు తెలుపుచున్నది-


సీ. ఎదురైనచో దన మదకరీంద్రము డిగ్గి

కే లూత యొసగి యెక్కించుకొనియె

మనుచరిత్రం బందుకొనువేళ బుర మేగ

బల్లకి తనకేల బట్టియెత్తె

బిరుదైన కవిగండ పెండేరమున కీవె

తగు దని తానె పాదమున దొడిగె

గోకటగ్రామా ద్యనే కాగ్రహారము

లడిగినసీమలయందు నిచ్చె

నాంధ్రకవితాపితామహ యల్లసాని

పెద్దనకవీంద్ర యని నన్ను బిలుచునట్టి

కృష్ణరాయలతో దివి కేగలేక

బ్రతికియుండితి జీవచ్ఛవంబ నగుచు.


అంతేకాక కృష్ణదేవరాయలు లోకాంతరగతుడు కాగానే కటకమునుండి గజపతి దండెత్తివచ్చినట్లును, అల్లసాని పెద్దన యీ క్రింది