పుట:AndhraKavulaCharitamuVol2.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క. వినిపించిరపుడు వారికి

గనకాంబరభూషణములు ఘనత నొసగి యా

జనవరు డప్పాజి గనుం

గొని యిట్టని పలికె నపుడు కుతుకం బలరన్. ఆ. 3


ఈ కుమారధూర్జటికవియే కాళహస్తి మహాత్మ్యమును రచియించి తనపెదతాత యైన ధూర్జటికవి కృష్ణదేవరాయలసభలో బ్రసిద్ధి పొందినట్లు కృష్ణరాయవిజయములో నీక్రింది పద్యముచేత జెప్పి యున్నాడు.


చ. స్తుతమతి యైనయంధ్రకవి ధూర్జటిపల్కుల కేలగల్గెనో

యతులిత మాధురీమహిమ నా మును మీ పెదతాత చాల స

న్నుతిగనె గృష్ణరాయలమనోజ్ఞ సభ న్విను మీపు నట్ల మ

త్కృతబహుమానవై ఖరుల గీర్తివహింపుము ధాత్రిలోపలన్. ఆ. 1


అష్టమహిషీకళ్యాణమును ద్విపదకావ్యముగా రచించిన తాళ్ళపాక చిన్నన్న యనుకవి కూడ కృష్ణదేవరాయని కాలములో నున్నట్లు కొండవీటిచరిత్రములో కృష్ణరాయల దానములనుగూర్చి చెప్పిన యీ క్రిందివాక్యమువలన దెలియవచ్చుచున్నది:-


"వినుకొండసీమలో మిన్నికల్లు తాళ్ళపాక చిన్నయ్యగారి కగ్రహార మిచ్చెను."

"అద్దంకిసీమలో వలపర్ల అను గ్రామము తాళ్ళపాక చిన్నయ్యగారి కిచ్చెను."


వీరుగాక తక్కినకవులు కృష్ణదేవరాయల యాస్థానమునందుగాని యాతనికాలమునందుగాని యున్నట్లు తోచదు. రామరాజభూషణాదులు కృష్ణరాయల యాస్థానమునం దున్నట్లునేక కథలు కానబడు చున్నవి కాని యితర నిదర్శనములు లేక యవి విశ్వసింపదగినవి కావు.