పుట:AndhraKavulaCharitamuVol2.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శా. కామాదు ల్గడు నీమదిం బెనగొనంగా నాదు నీతీరిత
   శ్రీమద్వాక్యము నీకు బథ్య మగునే శ్రీరామభీమాగ్నికీ
   లామేయాంబకరాజి నీతలలు నుగ్గాడంగ నావేళలన్
   నామాట ల్మది నీకు బథ్య మగు నన్నన్ రావణుం డుగ్రుడై. [యుద్ధకాండము]


ఉ. సర్వసురౌఘముల్ నను భుజాబలము ల్విడనాడి కొల్చు టా
   సర్వవిదుండు విష్ణుడు నిజంబుగ నాత డెఱుంగడే మహా
   గర్వితవిష్ణు డొక్కరుడెకా డలబ్రహ్మ యెదిర్చె నేని నే
   నోర్వక యుగ్రబాణముల కొక్కట నాహుతి చేసి వ్రేల్చెదన్. [యుద్ధకాండము]



55. అందుగుల వెంకయ్య

ఇతడు నియోగిబ్రాహ్మణుడు; అందుగుల సూరన్నకొమారుడు. ఈకవి కృష్ణదేవరాయల యల్లు డయిన రామరాజు తమ్ముడగు తిరుమలదేవరాయని మనుమని మనుమ డగు కోదండరామరాజు కాలములోనుండి యాతనిపేర రామరాజీయ మను నామాంతరముగల నరపతివిజయమను గ్రంథమును జేసెను. ఈగ్రంథమునందు రామరాజు పూర్వులయిన నరపతులచరిత్రమును విశేషముగా రామరాజుయొక్క చరిత్రమును జెప్పబడియున్నది. రామరాజు 1568 వ సంవత్సరమున తాళికోట యుద్ధములో మహమ్మదీయులచేత జంపబడెను. తదనంతరము మూడుతరములు గడచిన తరువాత నీగ్రంథము రచియింపబడిన దగుటచేత, ఇది 1650 వ సంవత్సరప్రాంతమున రచియింపబడినట్టు చెప్పవచ్చును. రామరాజు గుత్తి, పెనుగొండ, గండికోట, కందమాలు,