పుట:AndhraKavulaCharitamuVol2.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సీ. శ్రీహనుమద్వర శ్రీలబ్ధనుకవిత్వచతురుండ లక్షణసారసంగ్ర
   హం బొనరించి యుద్యత్కీర్తి బ్రఖ్యాతు డగుచిత్రకవి పెద్దనార్య సుతుడ
   విష్ణుచిత్తీయాదివివిధకావ్యార్థముల్ తెలిసి వక్కాణించుధీరసుతుడ
   గండికోటాఖ్యదుర్గస్థలాద్యక్షుడై పృథివి వంతుకు నెక్కు పెమ్మసాని


   చిన్నతిమ్మక్షమాపాలశేఖరుండు
   గారవింపగ బహుమానగౌరవముగ
   మనినధన్యుండ సభ్యసమ్మతగుణైక
   గరిమ వెలయు ననంతాఖ్య కవివరుండ.

ఈవ్యాఖ్యానమును చేయునప్పటికి గవి యిందుమతీపరిణయమును జేయలేదు. ఇతడు చేసిన యిందుమతీపరిణయము నాకు లభించినదికాదు. కవికాశ్రయుడైన పెమ్మసాని చినతిమ్మరాజుయొక్క యన్న పెదతిమ్మరాజు 1614 వ సంవత్సరమువఱకును రాజ్యముచేసిన వేంకటపతిరాయనికి మంత్రిగా నుండెను.



47. లింగముగుంట రామకవి


ఈకవి చతుర్వాటికామహాత్మ్య మను నైదాశ్వాసముల స్థలపురాణమును రచియించెను. ఇతడు మత్స్యపురాణము వామనపురాణము మొదలయిన గ్రంథములను రచియించిన ట్లీతని తమ్ముడైన లింగమగుంట తిమ్మకవి తనసులక్షణసారమందు వ్రాసెను గాని యాగ్రంథములు నాకు లభింపలేదు. ఈకవి తెనాలిరామకృష్ణునితోడి సమకాలికుడు. రామకృష్ణుని గురు వైన భట్టరు చిక్కాచార్యులు తనకు గురువైనట్లు కవి యీపద్యమున వ్రాసికొని యున్నాడు -