పుట:AndhraKavulaCharitamuVol2.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉ. పాయక బ్రాతృయుక్తుడయి భవ్యసుఖంబులు గాంచుచు న్జగ
   ద్గేయయశుం డతండు పరగె న్మహిదై వతపూజలం బితృ
   వ్యాయతతర్పణక్రియల నంచితధర్మము విస్తరిల్లగా
   జేయుచు భూరినిష్ఠ మహిషీయుతుడై మమఖాళి సల్పుచున్.


45. ముద్దరాజు రామన్న


ఇతడు కవిసంజీవని యనులక్షణగ్రంథమును రచించెను; మఱియు నితడు రాఘవపాండవీయమునకు వ్యాఖ్యానమునుగూడ జేసెను. ఇతడు నందవరీకనియోగిబ్రాహ్మణుడు; గణపయామాత్యుని కుమారుడు. ఇతడు పదునాఱవ శతాబ్దాంతమునం దున్నట్లు తెలియవచ్చుచున్నది. ఈకవి "శ్రీమన్మదనగోపాలకృపాకటాక్ష సంప్రాప్తసారసారస్వత సంపదానంద" యని గద్యమునందు వ్రాసికొన్నను లక్షణగ్రంథమును బట్టి కవిత్వపటుత్వనిర్ణయము చేయబూనుట యుచితముకాదు. ఇతడించుమించుగా లింగమగుంట తిమ్మకవితోడి సమకాలికు డగుటచే నీకవిలోకసంజీవనినుండి యతడు తనసులక్షణసారములో నేమియు గైకొనలేదు.



46. చిత్రకవి అనంతకవి

ఇత డారువేలనియోగి. రామరాజభూషణు డొనర్చిన హరిశ్చంద్రనలోపాఖ్యానమునకు వ్యాఖ్యానము చేయుటయేకాక యీకవి యిందుమతీపరిణయ మనుప్రబంధమును రచించెను. ఇతడు 1620వ సంవత్సరప్రాంతములందు కవిగా బ్రసిద్ధికెక్కినాడు. ఇతడు చిత్రకవి పెద్దనార్యుని పుత్రుడు; భారద్వాజగోత్రుడు. ఈకవి తన్నుగూర్చి తన హరిశ్చంద్రనలోపాఖ్యానములో నిట్లు చెప్పుకొన్నాడు.