పుట:AndhraKavulaCharitamuVol2.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవి కంసాలియగుటచే ననేకు లాక్షేపించుచువచ్చుటచేత గా బోలు రుద్రయ్య తనకృతిలో నీపద్యమును వేసియున్నాడు-


ఉ. శుష్కవచశ్శిలాతతుల సూటిగ జూచి మహాకవిశ్రవ
   శ్శష్కుళికావిదారణము సల్పగ నేర్చినజాణలార మీ
   ముష్కరతాసమున్నతికి మ్రొక్కెద నాయెడ జూపరాకుడీ
   దుష్కవులార సాధుజనదూషణభూషణభూషితాత్ములై.

ఈకవి స్వర్ణకారుడు; పెదలింగన్నపుత్రుడు. ఈకవిత్వము మృదుమధురపదభూయిష్టమై సలక్షణమయి వినువారివీనులకు విందు చేయునదిగా నున్నది. ఈతని కవిత్వరచనాకౌశలమును జూపుటకయి నిరంకుశోపాఖ్యానములోని కొన్నిపద్యముల నిందు బొందుపఱచు చున్నాను.


ఉ. అడిగిన నేమి దోషమె సమస్తధరాతలనాధ కోరికల్
   నుడువుల నున్నవే మనసులోపలగాక రతిప్రసంగముల్
   తడవని యంతమాత్రనె విదారితమోహుడె యీవిచారముల్
   విడుపుము వాగ్విశేషమును విశ్రుతవేషము మోక్షహేతువే. [ఆ.1]


ఉ. ఏమిజపంబు చేసి రొకొ యేమితపం బొనరించి రొక్కొ యే
   మేమిసవర్య లార్యతతి కిచ్చిరొకో జగదేకపూజ్యులై
   తాము దనూజరత్నములు దామరతంపరలై చెలంగువా
   రీమహి దొల్లి యంచు నుతియించి మహీసుర డాత్మలోపలన్. [ఆ.1]


ఉ. అత్తవు సర్వలక్షణసమగ్రగుణాడ్యవు నన్ను దిట్టనున్
   మొత్తనెకాని నీకొడుకుమూడత మానుప వేల వాడు గో
   తొత్తులమారియై గృహముత్రొక్కక యొక్కొకదాని బూనికన్
   గుత్తకు నంచు నుంచుకొని కోకలు రూకలు జోక నియ్యగన్. [ఆ.2]