పుట:AndhraKavulaCharitamuVol2.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

39. సవరము చిననారాయణనాయకుడు


ఈకవి కువలయాశ్వచరిత్ర మనెడి యైదాశ్వాసముల ప్రబంధమును రచియించి, తిమ్మనరపాలపుత్రుడయిన నారాయణభూపాలుని కంకితము చేసెను. ఈకవి తాను క్షత్రియుడ ననియు, రాయభూపాలుని పుత్రుడననియు చెప్పికొనియున్నాడు. ఈతడు రాయభూపాలునకు దిరుమలాంబ వలన గలిగిన ట్లీక్రింది పద్యమువలన దెలియవచ్చుచున్నది.-


మ. అత డాతిమ్మమయందు వేంకటనృపాధ్యక్షున్ రిపుచ్ఛేదనో
    ద్ధతు రంగాధిపు దిర్మలాంబవలనన్ ధర్మాత్ము గోపాలు ను
    న్నతకీర్తిం బిననారనాఖ్య దగు నన్నున్ గస్తురీంద్రున్ సమం
    చితకీర్తిన్ రఘునాథ దిమ్మవిభు గాంచెన్ నజ్జనాధారులన్.

కృతిపతి యైన నారాయణభూపాలుడు శ్రీరంగరాజ వేంకటపతిరాయలకు సహాయు డయియుండినట్లు చెప్పబడినందున గవి 1580 వ సంవత్సరప్రాంతములయం దుండినట్లు కానవచ్చుచున్నాడు. మఱియు గృతినాయకుడైన నారనరనాధుడు మట్ల యనంతభూపాలునికాలములో నుండిన ట్లీక్రింది పద్యమునందు జెప్పబడినందునను, కవి పదునాఱవశతాబ్దాంతమునం దుండినట్లు నిర్ధారణము చేయవచ్చును-


సీ. తనమాట చెంజికా తంజాపురీ మధురాధినాథులకు నెయ్యంబు నెఱప
   దనసిరి గోలకొండనరేంద్రముఖధరాధవపద్మబంధు లౌదల వహింప
   దనకీర్తిమట్లనంతనృపాలముఖ్యగోత్రామరేంద్రులు కొనియాడికొనగ
   దనదానగుణముగోదావరీతీరభూనిర్జరేశ్వరులు వర్ణించుకొనగ


   వెలయు వేదండగండనిర్గళదవర్గ
   ళమదధారాధునీనాధకుముదబంధు
   కార్యకృడ్డిండిమారావధుర్యసైన్యు
   డతడు ప్రభుమాత్రు డే నారనాధి నేత.