పుట:AndhraKavulaCharitamuVol2.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కానబడుచున్నది. ఈయిద్దఱుకవులును దమగ్రంథముయొక్క యాశ్వాసాంతగద్యము నీప్రకారముగా వ్రాసికొనియున్నారు-

"ఇది శ్రీమద్దుర్గాదక్షిణామూర్తివరప్రసాదాసాది సారస్వత తురగా రామకవి వరాయ్యంకి బాలసరస్వతినామధేయ ప్రణీతంబైన శ్రీస్కాందంబను మహాపురాణమునందు సనత్కుమారసంహితను నాగరఖండము"

ఈనాగరఖండము ధవళేశ్వరపు మార్కండేయుడను స్వర్ణ కారకులజుని కంకితము చేయబడినది. ఈవిశ్వకర్మవంశజుడు బెజవాడకు బ్రభువుగా నుండిన ట్లీక్రిందిపద్యమువల్ల దెల్ల మగుచున్నది.


మ. రజతాగం బొకరాజమౌళికి వినిర్మాణంబు గావించి యి
    చ్చె జగంబెన్నగ విశ్వకర్మ మును దా జిత్రంబు గా దిప్పు డీ
    బెజవాడప్రభు డియ్య నెంతయును గల్పించున్ ధరిత్రిన్ మహా
    రజతస్వర్ణగృహంబు లెప్పుడు బుధవ్రాతంబు మోదింపగన్.

ఈధవళేశ్వరపుమార్కండుడు మహమ్మదు కుతుపషాహి కాలములో నుండినట్టు నాగరఖండముయొక్క యవతారికలో నీక్రిందిపద్యమున జెప్పబడిది-


క. అతడు ప్రసిద్ధి వహించెన్
   క్షితినగరజపతుల గెల్చి చెలగి జయశ్రీ
   సతి జేకొనిన మహమ్మదు
   కుతుపశ హాచంద్రునకును గుడుభుజమనగన్.

దీనినిబట్టి చూడగా గవి పదునాఱవశతాబ్దాంతమునందో పదునేడవశతాబ్దారంభమునందో యుండినట్టును, కవినిగూర్చి చెప్పెడి కథలన్నియు నబద్ధము లయినట్టును కనబడుచున్నవి. మహమ్మదుకుతుబుషాహి క్రీస్తుశకము 1581 వ సంవత్సరము మొదలుకొని 1611 వ సంవత్సరమువఱకును గోలకొండనవాబుగానుండి రాజ్యము చేసెను.