పుట:AndhraKavulaCharitamuVol2.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శా. ఆరాజేంద్రశిఖావతంసనిజబాహాయుక్తవిశ్వంభరా

ధౌరేయుండు విరోధిమంత్రిముఖముద్రాదక్షు డుద్యద్దయా

పారీణుండు పటీరతారకసుధాపాణింధమశ్రీయశో

హారుం డిన్ములపల్లి మాదవిభు పెద్దామాత్యు డుల్లాసియై.


ఈమానభూనాథు డెవ్వరో గ్రంథమువలన స్పష్టపడదుగాని యెనిమిదవయాశ్వాసాదియందలి యీక్రింది కృతిపతి సంబోధనపద్యము వలన నతడు శ్రీరంగరాయని రాజ్యకాలములోని యొక మండలేశ్వరుడని యూహింపదగియున్నది-


క. శ్రీరంగరాజసేవా | పారంగతహృదయ ! కమలభవ వంశపయ:

పారావార సుధాకర ! మారసమానావతార ! మాదయపెద్దా !


మొదటి శ్రీరంగరాజు విజయనగరసంస్థానమును 1574 వ సంవత్సరము మొదలుకొని 1585 వ సంవత్సరము వఱకును పాలించెను. రెండవ శ్రీరంగరాజు 1614 వ సంవత్సరమునకు తరువాత రాజ్యమునకు వచ్చెను. ఈకవి యీ యిరువురు రాజులలో నొకరికాలము నందుండినందున, పదునాఱవశతాబ్దముయొక్క యంతమునందో పదునేడవశతాబ్దముయొక్క యాదియందో యుండి యుండుటకు సందేహములేదు. ఇదిగాక కవియొక్క కాలమును నిర్ణయించుటకు గ్రంథమునందే యింకొక యాధారము కనబడుచున్నది. కృతినాయకునివంశమును వర్ణించుచు కందాళ అప్పలాచార్యులు కృతిపతియొక్క తండ్రికిని పెదతండ్రికిని గురువైన ట్లీక్రిందిపద్యములో జెప్పియున్నాడు-


శా. వందారువ్రజదోష మేఘపవనున్ వారాశిగంభీరు నా

నందాత్మున్ హరిపాదభక్తు నిఖిలామ్నాయజ్ఞ విశ్వంభరా

మందారక్షితిజాతమున్ నిగమసన్మార్గప్రతిష్ఠాపరున్

గందాళప్పగురున్ వివేకనిధి లోకఖ్యాతు వర్ణించుచున్.