పుట:AndhraKavulaCharitamuVol2.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వానివద్ద సనాచారభయ మెట్లక్కఱ లేదో యట్లే శుంఠయైన యీ యాచార్యునివద్ద నవశబ్దభయ మక్కఱలేదని విపరీతార్థము వచ్చునట్లు శ్లోకము పూరించి యాక్షేపించి వైష్ణవభక్తాగ్రేసడైన రామకృష్ణుడు భాగవతాపచారము చేయునని నమ్మదగియుండలేదు.


"కలనాటిధనము లక్కఱగలనాటికి" అను పెద్దనపద్యముపై రామకృష్ణకవి యాచేపణ చేసె నన్నకథ కల్పితమని యీవఱకే యల్లసాని పెద్దన చరిత్రమునందు జెప్పియున్నాముగదా ? ఆప్రకారముగానే రామకృష్ణకవి ముక్కు తిమ్మనార్యునియెడ గూడ నొకయపరాధము చేసెననియు, తిమ్మన యలిగి పండ్లూడదన్నగా మఱునాడు రామకృష్ణకవి దుప్పికొమ్ముతో నూడినపల్లమర్చుకొని కృష్ణరాయలసభకు వచ్చి కూరుచుండ రామభూషణకవి యెఱిగి రాజు "రవిగాననిచో గవికాంచునేకదా" యన్న సమస్య నిచ్చినప్పుడు


ఉ. ఆరవి వీరభద్రునిపదాహతి డుల్లినబోసినోటికిన్

నేరడు, రామకృష్ణకవి నేరిచెబో మనముక్కుతిమ్మరాట్

క్రూరపదాహతిం బడినకొక్కిరిపంటికి దుప్పికొమ్ము ప

ల్లా రచియింప; నౌర! రవిగాననిచో గవి గాంచునేకదా.


అని పూరించి యతని నవమానపఱిచెననియు, చెప్పెడికథ కూడ రామకృష్ణకవి ముక్కు తిమ్మనకాలములో నుండినవాడు కాకపోవుటచేత నిటీవలి బుద్ధిమంతులచే గల్పింపబడినదనియే నిశ్చ యింపవలసియున్నది. ఇతడు రామరాజభూషణునితో సమకాలికుడే యయినను, రామరాజభూషణుని వసుచరిత్రములోని "శ్రీ భూపుత్రి" యను పద్యముమీద రామకృష్ణుడు చేసెనన్న యాక్షేపణము పండితులు చేయదగినది కానందున దానిని సహితము సత్యమని నమ్ముట కాధారము కనబడదు. ఇతడు రామరాజభూషణుని కవిత్వము నాక్షేపించుచు,