పుట:AndhraKavulaCharitamuVol2.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"శుభమస్తు శ్రీమన్ మహారాజాధిరాజ పరమేశ్వర మూరురాయరగండ ఆదిరాయ విజయభాషాగీత ప్రవర రాయరగండ యవన రాజ్యసంస్థాపనాచార్య శ్రీవీరప్రతాపకృష్ణ దేవమహారాజులు విజయనగరాన సింహాసనస్థుడై పూర్వదిగ్విజయయాత్రకు విచ్చేసి ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి, రాజమహేంద్రవరము మొదలయిన దుర్గాలు సాధించి సింహాద్రికి విచ్చేసి స్వస్థిశ్రీ విజయాభ్యుదయ శాలివాహనశక వర్షంబులు 1438 అగు నేటి ధాత సం చైత్ర బ 13 స్థిరవారానా సింహాద్రినాథు దర్శించి తమతల్లి నాగాదేవమ్మగారికిన్ని తమతండ్రి నరసరాయునిగారికిన్ని పుణ్యముగాను దేవునికి సమర్పించిన కంఠమాల 1 కి ముత్యాలు 991 వజ్రమాణిక్యాల కడియాలజోడు 1 టి శంఖచక్రాల పతకం 1 న్ని పయిడిపళ్ళెం 1 న్ని తూకాలు గ 44292 కానిమాడలు గ 2000 తమదేవి చిన్నా దేవమ్మగారిచేతను సమర్పించిన పతకం 1 కి గ 500 తిరుమలదేవమ్మగారిచేతను సమర్పించిన పతకం 1 కి గ 500 యింత మట్టుకు సమర్పించిన ధర్మశాసనము."

కృష్ణరాయల విజయములనుగూర్చి పారిజాతాపహరణమునందును, మను చరిత్రమునందును జెప్పబడిన కొన్ని పద్యముల సం దుదహరించు చున్నాను.

చ. మునుకొని కొండవీటికడ మూడత రుద్రుడు కృష్ణనందను

న్మనసిజునిన్ జయించె నది మానుషమే నరసేంద్రు కృష్ణరా

యనృపతి కొండవీటికడ వాహనభూమి బ్రతాపరుద్రసం

దను డగువీరభద్రు గరుణామతి గాచె జగత్ప్రసిద్ధిగన్.

చ. నెలకొని కృష్ణరాయధరణీవిభు డుత్కలభూమిపాలుతో

గలన నెదిర్చి హ స్తికరకాండతతు ల్మసకంపు బాములై

మలసినచోట గూడిన సమగ్రయశో వసనంబు గప్పి తా

వలవగ జేసె భూసతిని వశ్యవిధిజ్ఞడుగాన నేర్పునన్.