పుట:AndhraKavulaCharitamuVol2.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పయిపద్యద్వయమునుబట్టి చూడగా రామకృష్ణకవియు తమ్మకవియు సమకాలీను లగుట స్పష్ట మగుచున్నది. వీరిలో తమ్మకవి తనవైజయంతీవిలాసమునందు తాను గోలకొండ కరణ మయినట్టును తనకాలము నందాదేశమును మహమ్మదుశాహి పాలముచేయుచుండినట్టును ప్రథమాశ్వాసములో నీక్రిందిపద్యమున జెప్పియున్నాడు.


చ. ఇనసమతేజులౌ నృపులనెల్ల మహమ్మదుశాహియేలు నీ

యెనుబదినాల్గుదుర్గముల నేలినయేలిక గోల్కొండ త

ద్ఘసనగరస్థలిన్ గరణికం బొనరించును దమ్మమంత్రి యా

జనపతి రమ్ము పొ మ్మన ప్రజ ల్జయపెట్ట గృహస్థు లౌననన్.


ఈమహమ్మదుశాహి నవాబుగానుండి గోలకొండరాజ్యమును క్రీస్తుశకము 1581 వ సంవత్సరము మొదలుకొని 1611 వ సంవత్సరమువఱకును పాలించినందున, ఈతని కాలమునందున్న తమ్మకవియు నాకాలమునందే జీవించియుండెను. తమ్మకవితోడి సమకాలికుడయిన రామకృష్ణకవియు నించుమించుగా నీకాలమునందే యనగా పదునాఱవ శతాబ్దాంతమునందును పదునేడవ శతాబ్దాదియందు నుండెననుటకు సందేహములేదు. కవియొక్క కాలనిర్ణయము చేయుటకు పాండురంగమాహాత్మ్యమునం దింకొకయాధారముకూడ కనబడుచున్నది. పాండురంగ మాహాత్మ్యమును కృతినందిన విరూరి వేదాద్రి యొక చిన్నజాగీరుదారయిన పెదసంగమరాజువద్ద ప్రధానిగా నుండెను. ఈవిషయము పాండురంగమాహాత్మ్యమునం దిట్లు చెప్పబడినది.


సీ. తనకులాచారవర్తన వైష్ణవాచారపర్యాయముల కొజ్జబంతియనగ

దనసూనృతముపురాతనసత్యనిధులయున్నతికి బునప్రతిష్ఠితముగా గ

దనబుద్ధి నీతిశాస్త్రరహస్యములు తెల్లముగ దెల్పువ్యాఖ్యానముద్రగాగ

దనవ్రాయుగంటంబుమొనవాడి విశ్వంభరాప్రజలకు బ్రాణరక్షగాగ