పుట:AndhraKavulaCharitamuVol2.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణరాయలు 1515 వ సంవత్సరమునందు పూర్వదిగ్విజయ యాత్ర వెడలి ఆ సంవత్సరమునందె కొండవీడు, బెల్లముకొండ, బెజవాడ, కొండపల్లి, రాజమహేంద్రవరము మొదలయిన ప్రదేశములను జయించి, 1516 వ సంవత్సరమునందు విశాఘపట్టణమండలములోని భీమునిపట్టణమున కయిదుక్రోసులదూరములో నున్న పొట్నూరివద్ద రాతిజయ స్తంభమును వేయించి, ఆ మండలములోని వీరవల్లి తాలూకాలోని వడ్డాది జయించి, ఉత్కలదేశములోని కటకపురమువఱకును బోయి కటకపురమును గాల్పగా, కళింగదేశాధిపతియై యోడ్రదేశమును బాలించుచుండిన ప్రతాపరుద్రదేవుడు తనకుమార్తైన తిరుమలదేవిని రాజునకిచ్చి వివాహముచేసి సంధి చేసికొనెను. అందుచేత గృష్ణదేవరాయలు రాజమహేంద్రవరము వఱకును గల కళింగదేశమును మరల బ్రతాపరుద్రదేవుని కిచ్చివేసి, 1516 వ సంవత్సరాంతమున కాంచీపురము ప్రవేశించెను. ఈతని ప్రథమ భార్యయైన చిన్నాదేవికి అన్నపూర్ణాదేవియనియు నామాంతరముగలదు. ఈతనికి దిరుమలదేవియు నన్నపూర్ణాదేవియు నిద్దఱుభార్యలగుటను గృష్ణదేవరాయలు తాను విష్ణు చిత్తీయమునం దిట్లు తెలిపియున్నాడు:-

క. ఆవిభు ననంతరంబ ధ

రావలయము బూని తీపు రహిమై దిరుమ

ల్దేవియును నన్నపూర్ణా

దేవియు గమలాబ్జముఖులు దేవేరులుగన్.

ఈతడు పూర్వదిగ్విజయయాత్రలో సింహాచలమును దర్శించినప్పుడు భార్యాసహితముగా జేసినదానమునుగూర్చి సింహాచలదేవాలయములో నేడవ స్తంభముమీద జెక్కించిన యీక్రిందియంశమును విశాఘపట్టణమండల చరిత్రమునుండి తీసికొనుచున్నాను.