పుట:AndhraKavulaCharitamuVol2.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క. భావమున దోచె గలియుగ| పావనభూపాలకథలు బంధురకావ్య

శ్రీ వెలయ నాంధ్రభాషను|గావింపగవలయు సుప్రకాశత నాకున్.


పయిపద్యములనుబట్టి యితడు పురాణసారమను గ్రంథమును గూడ రచించినట్లు కనబడుచున్నదిగాని యా గ్రంథము దొరకలేదు.


చ. వినుతియొనర్తు నాంధ్రసుకవీంద్రుల నన్నయభట్టు దిక్కయ

జ్వను నమరేశ్వరుం జెదలువాడమహాత్ముని మారనార్యు నా

చనసుతసోము భాస్కరుని జక్కయనుం గవిసార్వభౌమునిన్

వనరుహపుత్రసన్నిభుల వర్ణితకావ్యకళానిధిజ్ఞలన్.


అని కవి తన సకలనీతికథానిధానములో శ్రీనాథుని వఱకును గల కవులనేస్తుతించి యున్నాడు. "చంద్ర శేఖర క్రియాశక్తి రాయలయొద్ద బాదుకొల్పితి సార్వభౌమ బిరుద" మని యుండుటనుబట్టి యీ పద్యమునందు బేర్కొనబడిన కవిసార్వభౌముడు శ్రీనాథుడనుటకు సందేహము లేదు. ఇంచుమించుగా సమకాలికులగుటచే గాబోలు నల్లసాని పెద్దనాదుల నితడిందు బేర్కొనలేదు.


సీ.ప్రభవించె నేవీట బర్వతాగ్రంబున నరిగెరీశ్వరుడు శ్రీనాయకుండు

వసియించె నేవీట వర్ణితసాలాంతరమున మూలస్థానరాజమౌళి

యుదయించె నేవీట నుత్తరాశాతటభూషణీకృతనింబ పుట్టలాంబ

వరియించె నేవీట వలదిశాకోణంబునందు గుబ్బటలమైలారమూర్తి

వినుతిగాంచె నేవీటను విప్రరాజ| వైశ్యశూద్రాదిబహువిథవర్ణ సమితి

యట్టి పురరత్న మొప్పుభవ్యాంబుజాత|మండితామరతరువల్లికొండపల్లి


క.ఇటువంటి కొండపల్లీ | పుట భేదన మంత్రిమకుట భూషణ మరిరా
ట్కటకవి భేదన ఘటనో | ద్భటుండు కుంటముకుల పిన భైరవుడొప్పున్.

ఇత్యాది పద్యములను బట్టి సకల నీతి కధా నిదాన కృతిపతి కొండపల్లి కధికారియైనట్టు కనబడు చున్నాడు. ఇట్లొక కృతి పతి వినుకొండకును