పుట:AndhraKavulaCharitamuVol2.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పినప్పుడు తక్కినవారు తీయుట కుపాయముతోచక యూరకుండగా గృష్ణరాయలు తనచేతిఖడ్గముతో జనకునివ్రేలు నఱికి యుంగరమును గైకొనెననియు, అతని సాహసమునకు మెచ్చి తండ్రి యాతనినే పట్టాభిషిక్తుని జేయ నియమించి దేహవియోగమును బొందెననియు కథలు చెప్పుదురు. నరసింహరాయని యనంతరమున జేష్ఠుడయిన వీరనృసింహరాయడే రాజ్యమునకు వచ్చినట్టు కృష్ణరాయని కంకితము చేయబడిన మనుచరిత్రాది గ్రంథములే చెప్పుచున్నందున , ఈ కడపటిసంగతి సత్యమయి యుండదు. కృష్ణదేవరాయడు సింహాసనమునకు వచ్చిన శీఘ్ర కాలములోనే యుద్ధయాత్రచేసి తన రాజ్యమును నానాముఖముల వ్యాపింపజేసెను. దాసీపుత్రు డగుటచేత నాతనికి సత్కులీనులగు రాజులెవ్వరును గన్య నియ్యనందున సింహాసన మెక్కునప్పటికి వివాహము కాలేదు. కృష్ణరాయలు 1513 వ సంవత్సరమునందు దక్షిణ దిగ్విజయ యాత్రకు బయలువెడలి మహిసూరు దేశములోని యుమ్మటూరు, శివసముద్రము, శ్రీరంగపట్టణము లోబఱుచుకొని గంగవంశరాజులను జయింపగా, తరువాత మహిసూరుదేశమంతయు స్వాధీనమయినది. ఈ దేశమును జయించినసంగతి పారిజాతాపహరణములోని ద్వితీయాశ్వాసాంతమందలి యీ క్రిందిపద్యమునందు సూచింపబడినది:-

శా. సమ్మర్దక్షమధీనిబంధనవిధాసంక్రందనాచార్య శూ

రమ్మన్యాచలవజ్రనాత జగతీరక్షాంబుజాక్షా శర

ధ్యమ్మార్గస్థవశాస్య రాజ్యసమ సహ్యప్రోద్భవాతీర భా

గుమ్మత్తూరి శివంసముద్రపుర వప్రోన్మూలనాడంబరా.

ఆ సంవత్సరమునందే కృష్ణదేవరాయలు నెల్లూరుమండలములోని యుదయగిరిమీదికి దండెత్తి, దాని కధికారిగానున్న వీరభద్రపాత్రుని పినతండ్రియైన ప్రహరేశ్వర పాత్రుని జయించి యా దుర్గమును సాధించెను. అటుతరువాత గృష్ణరాయల మంత్రియైన యప్పాజీ యను నామాంత