పుట:AndhraKavulaCharitamuVol2.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భయపడినట్లు చెప్పితిననియు "షడ్జం మయూరో వదతి" యని యుండుటచేత షడ్జస్వరోద్గీతమైన గీతమును విని నెమలికూతయని పాములు భయపడి పాఱి తొఱ్ఱలుదూఱుట స్వభావమేయనియు, సమాధానమును చెప్పెనట. సభవారాయాక్షేపణ సమాధానములు విని రామరాజభూషణుడే యోడెనని నిర్ధారణము చేసిరట ! అంతట పట్టిన ప్రతిజ్ఞ ననుసరించి రామభద్రకవి రామరాజభూషణుని శిరోవేష్టనము తీయించి క్రింద బెట్టించి సభలో నాతనితల దన్నెనట! కొందఱాతని తలకు మాఱుగా శిరోవేష్టమునే తన్నెనని చెప్పుదురు. ఈ కథ యిప్పుడు క్రొత్తగా వచ్చినదిగాక యప్పకవికాలమునాటికే యున్నందున దీనియందు గొంత సత్యమున్నదని యూహింప వలసియున్నది. అప్పకవి పూర్వకవి వర్ణనము చేయుచు తన గ్రంథములో


"రామరాజవిభూషణరత్నఖచిత

చారుమస్తకలాపాపహారి వాక్య

గౌరవము పెక్కుభంగుల గణనచేసి"


అని రామరాజభూషణునియొక్క కిరీటమును దీయించినవాడని రామభద్రకవికి విశేషణముగా జెప్పినాడు.

హరిశ్చంద్రనలోపాఖ్యానమును రచించునప్పటికి రామరాజుభూషణుడు వృద్ధుడయినాడు. అప్పటికే విద్యానగరసంస్థాన మంతయు పూర్ణముగా నిశించిపోయినది. పింగళి సూరనార్యుడు రాఘవపాండవీయమును జేసినతరువాత రామరాజభూషణుడు హరిశ్చంద్రనలోపాఖ్యానమును రచియించెను. ఈ రెండుగ్రంథములలోని గుణదోషము లెట్టివైనను రాఘవపాండవీయమునకు వచ్చిన ప్రసిద్ధి యీ గ్రంథమునకు రాలేదు. రామరాజభూషణు డీ ద్వ్యర్థికావ్యమును శ్రీరామాంకితము చేసెను. ఈ కృతి పదునాఱవ శతాబ్దాంతమునందు రచియింపబడినట్టు