పుట:AndhraKavulaCharitamuVol2.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గముచేత రెంటికినడుమ నతడు చేసినకావ్య మింకొకటి యుండవలసి నందున నదియే నరసభూపాలీయమనియు, బహుపద ప్రయోగముచేత నిద్దఱికంటె నెక్కువరాజు లుండవలసి నందున వారే రామరాజు తిరుమలరాజు నరసరాజు ననియు, మూడుగ్రంథములను రచించినవా డొక్కడేయనుట కింకొకయుక్తిని జెప్పుచున్నారు. ఈ యుక్తి యెంత యాదరణీయమో బుద్ధిమంతులు తమలో దాము నిర్ణయించుకో వలెను. ఈకవి తన జనకపితను పాలకపితనుగూడ సంతోషపెట్టుటకయి యొక పుస్తకమునందు కన్నతండ్రిపేరు వేసెననియు, ఒకపుస్తక మునందు పెంచుకొన్న తండ్రిపేరు వేసెననియు, ఒకపుస్తకమునం దెవ్వరిపేరును వేయక విడిచెననియు జెప్పుచు, ఆయా పుస్తకములయం దుపయోగింపబడిన పదములే యొకడు జనకపితయనియు నొకడు పాలకపితయనియు సూచించుచున్నవని చెప్పుచున్నారు. హరిశ్చంద్ర నలోపాఖ్యానములోని "సూరపాత్మజుడ" నను వాక్యమువలన సూరపరాజున కౌరసుడని యాత్మజ శబ్దము దృడపఱుచు చున్నదనియు, నరసభూపాలీయము లోని "వేంకటరాయభూషణ సుపుత్రు" నను వచనమువలన వేంకటరాయ భూషణునకు దత్తుడని సుపుత్రశబ్దము దృడపఱచుచున్నదనియు వాదించుచున్నారు. ఈ యర్థములయం దాత్మజశబ్దమునకు దనవలన బుట్టినవాడుకాని దత్తుడు కాడనియు, సుపుత్రశబ్దమునకు పున్నామనరకము నుండి రక్షించు దత్తుడుకాని కన్నవాడు కాడనియు గ్రహింపవలెను. ఈ యంశముల కనుకూలముగానుండు కథలు కొన్నికలవుగాని గ్రంథ విస్తారభితిచే వానిని విడుచుచున్నాను.

వసుచరిత్ర కర్తయు నరసభూపాలీయకృతికర్తయు నొక్కడేమోయని నాకు సందేహము కలిగించుటకు గారణములయిన యంశములను మఱికొన్నిటిగూడ నిప్పు డిందు జేర్చుచున్నాను. వీనిని పయినిజెప్పిన వానితో జేర్చి చదివి బుద్ధిమంతులు తమ యిచ్చవచ్చిన సిద్ధాంతము చేసి కొనవచ్చును.